ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిడ్డు మరకలను వదిలించే సింపుల్ చిట్కాలు

Life style |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 10:24 PM

వంట చేస్తున్నప్పుడు అనుకోకుండా నూనె డబ్బా చేయి జారి కింద పడుతుంది. కూర చేసే సమయంలో ఓ నాలుగైదు చుక్కలు ఫ్లోర్ పైన పడతాయి. ఇలా ఏదో విధంగా కిచెన్ లో ఆయిల్ కింద పడుతూనే ఉంటుంది. వంటగదిలో ఇలా రెగ్యులర్ గా నూనె పడడం వల్ల క్రమంగా ఆ ప్రాంతమంతా జిడ్డుగా మారిపోతుంది. ముఖ్యంగా స్టవ్ వెనకాల ఉండే టైల్స్ కి ఈ మరకలు ఎక్కువగా పడతాయి. జిడ్డుదనం బాగా పెరుగుతుంది. తరవాత ఎన్ని సార్లు తుడిచినా సరే అసలు ఈ మరకలు తొలగిపోవు. ఇందుకోసం ఎన్నో తంటాలు పడుతూ ఉంటారు. అయితే..ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా ఇప్పుడు చెప్పినట్టుగా కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా సులువుగా జిడ్డు మరకలు తొలగించుకోవచ్చు. మరి ఈ చిట్కాలేంటి. ఏం చేస్తే మరకలు పోతాయి అనే వివరాలు తెలుసుకుందాం.


కిచెన్ లో నూనె మరకలు


ఉదయం లేవగానే కిచెన్ లోకి పరుగులు పెట్టాల్సిందే. చకచకా పనులు చేసుకోవాలి. వంట పూర్తి చేసుకుని బాక్స్ కట్టుకుని ఆఫీస్ కి బయల్దేరాలి. ఇది డైలీ రొటీన్. అయితే..ఇదెంత సహజమో..వంట చేసేటప్పుడు నూనె మరకలు పడడం కూడా అంతే సహజం. పైగా చాలా వేగంగా వంట చేస్తున్న సమయంలో పొరపాటున చేయి తగిలి నూనె ఒలికిపోతూ ఉంటుంది.


ఫలితంగా వంట గదిలో ఫ్లోర్ అంతా చాలా జిడ్డుగా మారుతుంది. చూసుకోకుండా దానిపై నడిస్తే ఉన్నట్టుండి జారి పడిపోతారు. ఇది చాలా తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. అయితే..నూనె పడగానే అందరూ చేసే మొదటి పని టిష్యూతో తుడవడం. ఇంకొందరైతే ఏదైనా పాత బట్టలు ఉంటే వాటితో నూనె మరకలు తుడుస్తారు. కానీ అలా చేసినా కూడా జిడ్డు వదలదు. అలాంటప్పుడే ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా త్వరగా జిడ్డు వదులుతుంది. అవేంటో చూద్దాం.


ఉప్పు చిట్కా


​నూనె ఒలికిపోయి ఫ్లోర్ బాగా జిడ్డుగా కనబడినప్పుడు ఇప్పుడు చెప్పే ఓ చిట్కా పాటించాలి. అదేంటంటే సింపుల్ గా ఉప్పు వాడడం. మామూలుగా అయితే నూనె పడినప్పుడు టిష్యూ వాడుతుంటారు. ఈసారి మరో చిట్కా పాటించండి. సింపుల్ గా ఉప్పు వాడితే సరిపోతుంది. ఎక్కడైతే ఎక్కువగా జిడ్డు మరకలున్నాయో..ఎక్కడైతే నూనె ఒలికిపోయిందో అక్కడ ఉప్పు చల్లాలి. కనీసం ఐదు నిముషాల పాటు అలాగే ఉంచాలి. ఈలోగా ఉప్పు నూనెని పూర్తిగా గ్రహిస్తుంది. అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది.


ఫలితంగా చాలా సులువుగా జిడ్డు మరకను తొలగించేందుకు వీలుంటుంది. ఉప్పు వేసిన 5 నిముషాల తరవాత టిష్యూ లేదా ఓదైనా ఓ టవల్ తీసుకుని ఉప్పుతో సహా రబ్ చేస్తూ క్లీన్ చేయాలి. అయితే..రోజూ వంటకోసం వాడే సన్న ఉప్పు కాకుండా కల్లుప్పు వాడడం మంచిది. ఇది చాలా త్వరగా నూనె మరకలను తొలగిస్తుంది. జిడ్డుని పోగొట్టడంతో పాటు వంట గదిలో దుర్వాసనను తగ్గిస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా చాలా సులువుగా పాటించగలిగే చిట్కా ఇది.


బేకింగ్ సోడా చిట్కా


​బేకింగ్ సోడా ఎంత పవర్ ఫుల్ గా పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఎక్కడ ఏ మొండి మరక ఉన్నా సరే కాస్తంత బేకింగ్ సోడా వాడితే చాలు. సులువుగా కనిపించకుండా పోతుంది. అయితే..జిడ్డు మరకలను వదిలించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడైతే నూనె ఒలికిపోయిందో అక్కడ బేకింగ్ సోడా వేయాలి. కొద్ది నిముషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరవాత ఓ టిష్యూ పేపర్ తీసుకుని పూర్తిగా బేకింగ్ సోడాని తొలగించాలి. కాసేపట్లోనే మరక తొలగిపోతుంది. పైగా జిడ్డుదనం కూడా తగ్గిపోతుంది. అయితే..కిచెన్ లో కాకుండా ఇంట్లో వేరే చోట ఫ్లోర్ పైన నూనె పడినప్పుడు దానిపై బేకింగ్ సోడా వేయాలి. మాప్ తడపకుండా పొడిగా ఉన్నప్పుడే దాంతోనే తుడవాలి. లేదా చీపురు వినియోగించవచ్చు. ఇలా కాసేపట్లోనే మరకను తొలగించుకోవచ్చు. అది కూడా పెద్దగా ఖర్చు లేకుండానే.


మొక్కజొన్న పిండి


మొక్కజొన్న పిండితో కూడా నూనె మరకలు తొలగించుకోవచ్చు. కేవలం నూనె మరకలు అనే కాదు. సాస్ మరకలు తొలగించడానికి కూడా ఈ పిండి ఉపయోగపడుతుంది. ఏ మరకనైనా సరే చాలా త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. మరక పడిన చోట పిండి చల్లాలి. ఓ లేయర్ లాగా వేయాలి. కనీసం పదినిముషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరవాత చీపురుతో పూర్తిగా ఊడ్చేయాలి.


లేదా వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేయవచ్చు. ఎక్కువ మొత్తంలో నూనె ఒలికిపోయి బాగా జిడ్డుగా మారినప్పుడు ఈ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. ప్యాన్ లో ఫ్రై చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి నూనె పడిపోయిందని అనుకుందాం. ఈ ఆయిల్ మరకను పోగొట్టడంలో ఉప్పు, బేకింగ్ సోడా కన్నా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది మొక్కజొన్న పిండి. పైగా నూనె మరకలు ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా కూడా చూస్తుంది. గ్రీస్ మరకలను కూడా తొలగించే గుణం ఇందులో ఉంటుంది.


డిష్ వాష్ లిక్విడ్ 


ఇప్పుడు చెప్పిన అన్ని చిట్కాలతో పాటు మరో చిట్కా కూడా ప్రయత్నించవచ్చు. అదేంటంటే..డిష్ వాష్ లిక్విడ్ చిట్కా. నూనె ఒలికిపోయి బాగా జిడ్డుగా కనిపించే చోట డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. అయితే..నేరుగా వాడడం కాకుండా ముందుగా కొన్ని నీళ్లు తీసుకుని కాస్తంత వేడి చేయాలి. అవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నూనె పడిన చోట పోయాలి. ఆ తరవాత ఏదైనా ఓ సాఫ్ట్ క్లాథ్ లేదా టిష్యూ పేపర్ తో క్లీన్ చేయాలి. ఈ లిక్విడ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా వేగంగా జిడ్డు మరకలను తొలగిస్తుంది. స్టవ్ పైన, కిచెన్ ప్లాట్ ఫామ్ పైన మరకలు పడినప్పుడు ఈ చిట్కా పాటించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa