ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యాపార సామ్రాజ్యంపై పాలకుడి పంజా: అమెరికా కలలపై ఆనంత్ ఆంబానీ వంతారా గురి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 01:37 PM

మేడిపండు పైకి కనిపించేంత ఎర్రగా ఉండదు, విప్పి చూస్తేనే అసలు విషయం తెలుస్తుంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల సంబంధం కూడా అంతే. పైకి గొప్పగా స్నేహితులుగా కనిపిస్తున్నా, తెర వెనుక జరిగే కథలు వేరు. గతంలో మోదీకి, రిలయన్స్ అధినేతలకు మధ్య ఉన్న బంధం ఇప్పుడు కాస్త దూరమైందనే వార్తలు ఢిల్లీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మోదీతో ఎంతో సఖ్యంగా ఉన్న రిలయన్స్, ఇప్పుడు ఒక ప్రోటోకాల్ సంబంధాన్ని మాత్రమే కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిలో మోదీ, అంబానీ కలయికపై పలు రకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ కలయిక కేవలం బయటికి మంచిగా కనిపించడానికి మాత్రమేనని, వారి మధ్య గ్యాప్ లేదని అంబానీ చెప్పడానికి ప్రయత్నించారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
కొద్దికాలం క్రితం ముఖేష్ అంబానీ తన వ్యాపారాలను అమెరికాలో విస్తరించాలని ప్రణాళికలు రచించారు. దీని కోసం సుమారు 200 కోట్ల విలువైన భవనాన్ని కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు ప్రపంచంలోని దిగ్గజ సంస్థలైన Apple, Microsoft, Google, OpenAI వంటివి మన దేశంలో పెట్టుబడులు పెడుతుంటే, రిలయన్స్ అమెరికాకు వెళ్ళడం దేశ పాలకుడికి నచ్చలేదని, ఈ విషయమే వారి మధ్య దూరం పెంచడానికి కారణమైందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయంలో మోదీ నేరుగా అంబానీని అడ్డుకోలేదు. బహిరంగంగా వ్యతిరేకించలేదు. కానీ, తమ అసంతృప్తిని పరోక్షంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ మానసపుత్రిక అయిన వంతారాపై చిన్న బాణం వేయడం ద్వారా అంబానీకి ఒక బలమైన సంకేతాన్ని పంపారు.
అనంత్ అంబానీ గుజరాత్‌లో జంతు సంరక్షణ కోసం వంతారా అనే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంపై సుప్రీంకోర్టులో ఒక ఫిర్యాదు నమోదైంది. ప్రధాన ఆరోపణ ఏమిటంటే, ఈ కేంద్రానికి విదేశాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని. ఈ కేసుపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సుప్రీంకోర్టు ఈ నివేదికను పరిశీలించిన తర్వాత వంతారాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సరైన నిబంధనల ప్రకారం ఏనుగులను తరలిస్తే అందులో ఎలాంటి తప్పు లేదని, యజమానుల నుంచి ఏనుగులను లాక్కోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ తీర్పు అంబానీకి ఒక ఊరటనిచ్చినప్పటికీ, ఈ కేసు వెనుక ఉన్న పాలకుడి బలమైన సంకేతం స్పష్టంగా కనిపించింది.
ఏ వ్యాపారైనా తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకోవడం సహజం. కానీ, ఒక దేశ పాలకుడికి, ముఖ్యంగా నరేంద్ర మోదీ లాంటి అత్యంత శక్తివంతమైన నాయకుడికి ఎదురు నిలిచి నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. మోదీ ఇప్పుడు కేవలం గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, భారతదేశ ప్రధానమంత్రి మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరు. ట్రంప్‌ను ధిక్కరించి, జిన్ పింగ్‌కు సవాల్ విసిరే స్థాయి ఉన్న నాయకుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ సంఘటన నిరూపిస్తుంది. ఒక బలమైన నాయకుడి ముందు వ్యాపార సామ్రాజ్యం ఎంత బలంగా ఉన్నా, దేశ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ఈ పరిణామం స్పష్టం చేసింది. అయితే ఈ పరిణామం భారతీయ వ్యాపార రంగంలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa