నిధుల సేకరణ, భారత్‌లో హింసాత్మక చర్యలకు ప్రణాళిక కోసం ఖలీస్థాన్ వేర్పాటువాదులు తమ దేశాన్ని కేంద్రంగా చేసుకున్నట్టు కెనడా ప్రధాన గూఢచారి సంస్థ జూన్‌లో విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. కెనడా కేంద్రంగా ఖలీస్థాన్ వేర్పాటువాదుల కార్యకలాపాలు సాగిస్తున్నట్టు అంగీకరించింది. ఇంకా చురుకుగానే ఉన్న కెనడాలో నిషేధిత ఉగ్రవాద నెట్‌వర్క్‌లు.. భారత్‌లో భద్రత పరిస్థితులను ప్రభావితం చేసేలా పనిచేస్తున్నట్టు గుర్తించింది. తాజాగా, ఉగ్రవాదులకు ఆర్ధిక సహాకారంపై కెనడా ప్రభుత్వం నివేదికలో ఖలీస్థానీలకు నిధులు కెనడా నుంచే అందుతున్నట్టు తెలిపింది. ఖలీస్థాన్ ఉగ్రవాద సంస్థలుగా కెనడా గుర్తించిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ వంటి వాటికి ఆర్ధిక మద్దతు కెనడా నుంచి అందుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించినట్టు నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఖలీస్థాన్ ఉద్యమ కేంద్రంగా కెనడా కొనసాగుతుండటంలో ఎటువంటి ఆశ్చర్యం కలిగించడం లేదు.
మనీల్యాండరింగ్, ఉగ్రవాదుల నిధుల ముప్పుపై కెనడా ఆర్ధిక శాఖ తయారుచేసిన నివేదికలో భాగంగా ఖలీస్థానీలకు తమ దేశం నుంచే మద్దతు అందుతుందని ఒప్పుకుంది. ‘కెనడాతో సహా అనేక దేశాలలో ఖలీస్థానీలు నిధులు సేకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు’ అని అది తెలిపింది. రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం సమూహాల కింద హమాస్, హిజ్బుల్లా, ఖలీస్థాన్ వంటి ఇతర ఉగ్రవాద గ్రూపులు,, కెనడా మధ్య ఆర్థిక సంబంధాలను కూడా నివేదిక ఎత్తి చూపింది.
ఉగ్రవాద గ్రూపులు చారిటీ పేరుతో సేకరించే నిధులను దుర్వినియోగం చేస్తున్నాయని, కెనడా ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే కేంద్రంగా మిగిలిపోయిందని నివేదిక పేర్కొంది. ప్రవాసుల నుంచి సేకరించిన విరాళాలు సహా లాభాపేక్ష రంగాన్ని ఖలిస్థానీ ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తున్నారని ఎత్తి చూపింది. ‘ఈ గ్రూపులకు గతంలో కెనడాలో విస్తృతమైన నిధుల సేకరణ నెట్‌వర్క్ ఉంది.. కానీ ఇప్పుడు ఆ లక్ష్యానికి విధేయత చూపే వ్యక్తుల చిన్న సమూహాలుగా ఏర్పడినట్టు కనిపిస్తున్నాయి.. కానీ ఒక నిర్దిష్ట సమూహంతో ప్రత్యేక అనుబంధం లేదు’ అని నివేదిక పేర్కొంది.
ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి అనుసరిస్తోన్న మనీ సర్వీస్ బిజినెస్, బ్యాంకింగ్ రంగ దుర్వినియోగం, క్రౌడ్‌ఫండింగ్, క్రిప్టోకరెన్సీ వినియోగం ప్రభుత్వాల నుంచి నిధుల సేకరణ, చారిటీలు వంటి వివిధ నిధుల సేకరణ పద్దతులను తాజా నివేదిక గమనించింది. చాలా సంవత్సరాలుగా ఖలీస్థానీ ఉగ్రవాదులు తమ అడ్డగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయినాసరే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఖలీస్థానీ ఉగ్రవాది హత్యకు గురైతే.. దానిని కెనడా మాజీ ప్రధాని జస్టిన్ భారత్‌కు అంటగట్టే ప్రయత్నం చేశారు. ట్రూడో ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారనే విమర్శలు వచ్చాయి. మరి ఆయన తప్పిదాలను ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ సరిదిద్దుతారా? లేక అదే వైఖరిని కొనసాగిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa