ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్ధాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తినే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడేందుకు యత్నించారు. కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ అధికారులమని నమ్మించి, ఆమె వ్యక్తిగత వివరాలు రాబట్టడానికి విఫలయత్నం చేశారు. ఈ ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 5న ఉదయం 9:40 గంటల సమయంలో సుధామూర్తికి ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను కేంద్ర టెలికాం శాఖ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. ఆమె మొబైల్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం కాలేదని, ఆ నంబర్ నుంచి అసభ్యకరమైన సందేశాలు వెళుతున్నాయని ఆరోపించాడు. వెంటనే స్పందించకపోతే మధ్యాహ్నంలోగా నంబర్‌ను బ్లాక్ చేస్తామని బెదిరించాడు. అయితే, ఆ వ్యక్తి ప్రవర్తనపై అనుమానం రావడంతో సుధామూర్తి అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత ఆ నంబర్‌ను ట్రూకాలర్‌లో పరిశీలించగా ‘టెలికాం డిపార్ట్‌మెంట్’ అని కనిపించడం గమనార్హం. ఈ మోసపూరిత యత్నంపై సుధామూర్తి తరఫున గణపతి అనే వ్యక్తి జాతీయ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సెప్టెంబర్ 20న సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa