ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల మరణాలు భయపెడుతున్నాయి. ఒకటీ రెండు కాదు.. గత 15 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఆడవారితో పోలిస్తే మగవారి మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. 2009 నుంచి 2022 మధ్య కాలంలో అంటే 15 సంవత్సరాలలో, ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ మరణాల కంటే పురుషుల మరణాలు ప్రతి సంవత్సరం కనీసం 25 శాతం చొప్పున ఎక్కువగా నమోదవుతూ ఉండటం గమనార్హం. ఇక గత ఏడు సంవత్సరాలలో ఈ తేడా మరింత పెరిగింది. పురుషుల మరణాలు, స్త్రీల మరణాల మధ్య తేడా 45 నుంచి 59 శాతం వరకూ ఉందని లెక్కలు చెప్తున్నాయి. ముఖ్యంగా మధ్యవయస్కులలోఈ తేడా చాలా ఎక్కువగా ఉంది. మధ్యవయస్కులైన మహిళల మరణాలతో పోలిస్తే మధ్యవయస్కులైన మగవారి మరణాలు ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. మిడిల్ ఏజ్ గ్రూప్‌నకు సంబంధించి మహిళల మరణాల కంటే మగవారి మరణాలు సుమారుగా రెట్టింపు కావటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లోని 15 ఏళ్ల గణాంకాలను విశ్లేషిస్తే ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఉదాహరణకు 2009 సంవత్సరాన్ని తీసుకుంటే ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా లక్షా 88 వేల మంది మహిళలు వివిధ కారణాలతో చనిపోయారు. అయితే అదే ఏడాది చనిపోయిన పురుషుల సంఖ్య 2 లక్షల 44 వేలు. ఇది ఆడవారి మరణాల కంటే సుమారుగా 30 శాతం ఎక్కువ. 2010, 2011, 2012, 2013లోనూ ఇదే తరహా ధోరణి కొనసాగింది. అయితే ఈ తేడా 2014లో 11.2 శాతంగా, 2015 నాటికి 7.2 శాతానికి తగ్గింది. అయితే 2015 నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఏడాది స్త్రీల మరణాలు 1.22 లక్షలు అయితే.. పురుషుల మరణాలు 1.92 లక్షలుగా నమోదయ్యాయి. తేడా ఏకంగా 56 శాతం. ఇక ఈ తేడా 2016లో 57.4 శాతంగా, 2017లో 59.5 శాతానికి చేరుకుంది.
ఈ లెక్కలను అన్నింటినీ గమనిస్తే వయసుతో సంబంధం లేకుండా అన్ని వయస్కుల వారిలోనూ మహిళల మరణాలతో పోలిస్తే పురుషుల మరణాలు అధికం. అయితే పనిచేసే వయసు అయిన 25 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్యవారిలో ఈ అంతరం చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు 2018 ఏడాదిని తీసుకుంటే ఆ సంవత్సరం 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు ఉన్న మగవారు 14396 మంది చనిపోయారు. అదే వయసు ఉన్న ఆడవారి మరణాలు 6,605గా నమోదయ్యాయి. తేదా ఏకంగా 7791 కాగా.. ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాలు రెట్టింపు కావటం గమనార్హం. 2020 వరకూ ఇదే తరహా ట్రెండ్ కొనసాగింది.
అయితే మహిళల మరణాలతో పోలిస్తే పురుషుల మరణాలు ఎక్కువగా నమోదవుతూ ఉండటం, అందులోనూ 25 నుంచి 34 ఏళ్ల మధ్యవారి మరణాల్లో తేడా ఎక్కువగా ఉండటంపై వైద్యులు తమదైన విశ్లేషణ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల కేసులు, ఆత్మహత్యలు, వృత్తిపరమైన ఇబ్బందులు వంటి కారణాల వలన ఈ ఏజ్ గ్రూప్‌లో మగవారి మరణాలు ఎక్కువగా నమోదవుతూ ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అలాగే కార్డియోవాస్కులార్(గుండె సంబంధిత ఇబ్బందులు), మెటాబాలిక్ డిజార్డర్లు మహిళలతో పోలిస్తే పురుషులలో కనీసం పదేళ్ల ముందుగానే ప్రారంభమవుతాయని వైద్యులు చెప్తున్నారు. అది కూడా మగవారి మరణాల శాతం ఎక్కువగా ఉండేందుకు కారణం కావొచ్చనేది మరో వాదన. అలాగే మహిళలతో పోలిస్తే రిస్క్ ఎక్కువగా తీసుకోవడం, ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధ కూడా కారణం కావొచ్చంటున్నారు. మరోవైపు ఈ గణాంకాలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాలని.. మధ్యవయసు వారిలో ఆడవారి మరణాల కంటే మగవారి మరణాలు ఎక్కువగా నమోదవుతున్నందుకు గల కారణాలను పూర్తిస్థాయిలో అన్వేషించాలని ప్రజారోగ్య వేదిక వంటి సంస్థలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa