ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడి

international |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 10:28 PM

పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధంలో అమెరికాకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓవైపు ఇరాన్ నేరుగా జరిపిన క్షిపణి దాడుల్లో 5 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు విమాన ప్రమాదంలో ఆరుగురు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నా.. యుద్ధం ఆపేది లేదంటూ అమెరికా చెబుతూ వస్తోంది.


సౌదీపై ఇరాన్ దాడుల్లో ఐదు విమానాలకు నష్టం..


సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ ఇటీవల జరిపిన క్షిపణి దాడిలో.. ఐదు అమెరికన్ వైమానిక దళ రీఫ్యూయలింగ్ (ఇంధనం నింపే) KC-135 విమానాలు దెబ్బతిన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇవి పూర్తిగా ధ్వంసం కానప్పటికీ.. మరమ్మతులు చేయాల్సిన స్థితికి చేరుకున్నాయని స్పష్టం చేసింది. అయితే అదృష్ట వశాత్తూ ఈ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అమెరికా అధికారులు ధ్రువీకరించారు.


ఆరుగురు అమెరికా సైనికులు మృతి..


పశ్చిమ ఇరాక్ ఆకాశంలో జరిగిన ఒక విషాద ఘటనలో ఆరుగురు అమెరికన్ సైనికులు మరణించారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మరో విమానం కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. అయితే ఇది శత్రువుల దాడి వల్ల గానీ లేదా పొరపాటున జరిగిన 'ఫ్రెండ్లీ ఫైర్' వల్ల గానీ జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. KC-135 విమానాలు 1950ల నాటివి. గాలిలో ఉన్నప్పుడే ఇతర యుద్ధ విమానాలకు ఇంధనం నింపడంలో ఇవి అత్యంత కీలకంగా పని చేస్తాయి.


పెరుగుతున్న మరణాల సంఖ్య..


ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 13 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో కువైట్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ స్పందిస్తూ.. "యుద్ధం అంటే నరకమే. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇరాన్‌కు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు. అటు ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ సాయుధ గ్రూపులు తామే అమెరికా విమానాన్ని కూల్చేశామని ప్రకటించుకుంటుండగా.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa