పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఒమన్‌లోని సోహర్ నగరంలో జరిగిన భీకర డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. అయితే గాయపడిన వారు సైతం భారతీయులేనని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..?
ఒమన్‌లోని మస్కట్ సమీపంలో ఉన్న సోహర్ నగరంలోని అల్-అవాహి పారిశ్రామిక ప్రాంతంలో ఒక డ్రోన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న విదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 11 మంది గాయపడినట్లు అధికారులు గుర్తించారు. అయితే చనిపోయిన ఇద్దరు కూడా భారతీయులేనని తెలుసుకున్న అధికారులు.. వారి మృతదేహాలను స్వదేశానికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా గాయపడిన 11 మందిలో 10 మంది భారతీయులేనని స్పష్టం చేశారు. అయితే వీరందరినీ వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపగా.. ఐదుగురు ఇప్పటికే చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. మిగిలిన ఐదుగురు మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగానే ఉందని అదనపు కార్యదర్శి అసీమ్ మహాజన్ వెల్లడించారు.
భారతీయుల భద్రతపై ప్రధాని ఆరా..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రతతో పాటు ఇంధన రవాణా మార్గాల రక్షణపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఇరాన్ మంత్రితో చర్చలు జరిపారు. ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల గుండా ఆర్మేనియా మీదుగా సుమారు 170 మంది భారతీయులు సురక్షితంగా వెనక్కి వచ్చారు. అంతేకాకుండా గల్ఫ్ రీజియన్‌లో పని చేస్తున్న సుమారు 23,000 మంది భారతీయ నావికుల భద్రతను కూడా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
గ్యాస్, పెట్రోల్ కొరత లేదు.. ఆందోళన వద్దు!
మరోవైపు యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్‌పీజీ సరఫరాకు ఆటంకం కలుగుతుందనే వదంతులపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ స్పష్టం చేశారు. రోజువారీ గ్యాస్ బుకింగ్‌లు 50 లక్షల నుంచి ఒక్కసారిగా 80 లక్షలకు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మన రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని, క్రూడ్ ఆయిల్ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa