ఉత్తరాఖండ్‌లో తమ డిమాండ్లు తీర్చాలంటూ ఉపాధ్యాయులు చేస్తున్న నిరసన తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు నెల రోజులకు పైగా ఆందోళనా చేస్తున్నా ఉత్తరాఖండ్లోన బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంటూ.. ఓ ఉపాధ్యాయుడు రక్తంతో రాసిన లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. ఇప్పుడు ఏ లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయుల చిరకాల డిమాండ్ల పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని ఈ లేఖలో అభ్యర్థించారు. రక్తంతో రాసిన ఈ లేఖను ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రావిన్షియల్ సభ్యుడు రవి బగోటి రాశారు.
రవి బగోటి ఛంపావత్ జిల్లాలోని తానక్‌పూర్ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్‌గా(ఎల్టి) పనిచేస్తున్నారు. సుమారు 34 కీలక డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యా శాఖ కానీ స్పందించకపోవడంతో వేలాది మంది ఉపాధ్యాయులు నిరసనలు చేస్తున్నట్లు తన లేఖలో హైలైట్ చేశారు. పాత పింఛను పథకం పునరుద్ధరణ, పదోన్నతులు, బదిలీల విధానంలో పారదర్శకత తీసుకురావడం వంటివి ఉపాధ్యాయులు చేస్తున్న ముఖ్య డిమాండ్లు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రిన్సిపల్, హెడ్మాస్టర్ పోస్టుల ఖాళీలను గురించి రవి బగోటి తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉత్తరాఖండ్‌లోని దాదాపు 90 శాతం ఉన్నత పాఠశాలల్లో, అలాగే 95 శాతం ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఛంపావత్ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఒక్క ఫుల్‌టైమ్ ప్రిన్సిపల్ కూడా లేరని.. ఇంటర్మీడియట్ కాలేజీల్లో కేవలం ఐదుగురు ఫుల్‌టైమ్ ప్రిన్సిపల్లు మాత్రమే ఉండగా, వారిలో నలుగురు ఏడాది, రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్నారని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయుల సంఘం 100 శాతం సీనియారిటీ ఆధారంగానే ప్రిన్సిపాల్, హెడ్మాస్టర్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించడంపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం అన్యాయమని రవి బగోటి ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 500 మంది ఉపాధ్యాయులు ఇదే తరహాలో తమ నిరసనను వ్యక్తం చేస్తూ రక్తంతో లేఖలు రాసినట్లు సంఘం ప్రావిన్షియల్ అధ్యక్షుడు రామ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తమ నిరసనలో భాగంగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహిస్తున్నారని వెల్లడించారు. దీనిలో భాగంగా పాఠశాలల్లో బోధనకు మాత్రమే పరిమితమై, విద్యతో సంబంధం లేని ఇతర విధులన్నింటినీ బహిష్కరించినట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపల్స్, హెడ్మాస్టర్లు లేకపోవడం విద్యావ్యవస్థను బలహీనపరుస్తోందని, ఇన్‌ఛార్జి ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతోందని, ఇది విద్యార్థుల అభ్యాసానికి ఆటంకం కలిగిస్తోందని ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ఈ రక్తంతో రాసిన లేఖల ద్వారానైనా తమ సమస్యలకు పరిష్కారం లభించాలని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa