ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చనిపోయిన కూతురి కోసం గుడి కట్టిన తండ్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 07:06 PM

ఆడపిల్ల అంటే ఇప్పటికి కూడా చాలా మంది తల్లిదండ్రులకు చిన్న చూపే. ఆడపిల్ల పుడితే అనవసర ఖర్చు అనుకుంటారు. బిడ్డ పుట్టినప్పటి నుంచే వివక్ష చూపిస్తారు. తనకు నచ్చిన చదువు కాదు కదా.. కనీసం నచ్చిన తిండి కూడా తిననివ్వరు కొందరు తల్లిదండ్రులు. మగపిల్లలను ఒకలా.. ఆడబిడ్డలను ఒకలా చూస్తారు. ఇప్పుడు పరిస్థితులు మరీ ఇంత దారుణంగా లేవు కానీ.. ఇప్పటికి కొందరు తల్లిదండ్రులు ఆడబిడ్డల మీద వివక్ష చూపిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారి మధ్య.. బిడ్డను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ఓ తండ్రి.. కుమార్తె మరణంతో కుంగిపోయారు. కానీ పది కాలాల పాటు తన బిడ్డను ప్రతి ఒక్కరు తలుచుకోవాలనే ఉద్దేశంతో.. కుమార్తె జ్ఞాపకార్థం ఆలయం నిర్మించారు. ఆ వివరాలు..


కడప జిల్లా ప్రొద్దుటూరు, బుడ్డాయిపల్లెకు చెందిన 75 ఏళ్ల చాడా చెన్నకృష్ణారెడ్డి ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేశారు. ఆయన భార్య లక్షుమమ్మ. ఈ దంపతులకు ఒక్కతే ఆడబిడ్డ. ఆమె పేరు చంద్రకళ. ఆడబిడ్డ అయినా సరే అల్లారుముద్దుగా పెంచారు కృష్ణారెడ్డి. డిగ్రీ వరకు చదవించారు. ఆ తర్వాత మంచి సంబంధం చూసి.. పెళ్లి చేశారు. తన బిడ్డ భర్త, పిల్లలతో కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. వివాహం తర్వాత చంద్రకళ, ఆమె భర్త..ఇద్దరూ హైదరాబాద్‌లోని సదాశివపేటలో ఓ ప్రైవేట్ పైపుల కంపెనీలో జాబ్ చేసేవారు. చంద్రకళ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేయగా.. ఆమె భర్త మేనేజర్‌గా చేసేవాడు.


చంద్రకళ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. సంతోషంగా సాగుతున్న వారి కాపురం చూసి విధికి కన్ను కుట్టింది ఏమో.. కరెంట్ షాక్ కొట్టి చంద్రకళ చనిపోయింది. 21 ఏళ్ల క్రితం అనగా.. 2004 జూన్ 27న, మిద్దె మీద బట్టలు ఆర వేస్తూ.. ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కొట్టడంతో.. 27 ఏళ్లకే చంద్రకళ మ‌తి చెందింది. అప్పటికి ఆమె కుమార్తెకు ఐదేళ్ల వయసు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ.. ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో.. కృష్ణారెడ్డి జీవితం ఒక్కసారి తలకిందులయ్యింది.


కుమార్తె మరణం ఆయనని తీవ్రంగా కలచి వేసింది. ఆ బాధ నుంచి బయట పడలేకపోయారు కృష్ణారెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో తాను బస్సు నడపలేనని భావించిన ఆయన .. తన డ్రైవర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎన్ని చేసినా బిడ్డను మర్చిపోలేకపోయారు. ఏ పని చేస్తున్నా.. ఎక్కడకు వెళ్లినా కుమార్తె జ్ఞాపకాలే. దీంతో తన బిడ్డ పేరు పది కాలాల పాటు నిలవాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె పేరు మీద ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారు.


అనుకున్నట్లుగానే కుమార్తె గోపవరం పంచాయతీ పరిధిలోని యానాది కాలనీలో సీతారాముల ఆలయాన్ని నిర్మించారు కృష్ణారెడ్డి. ఈ గుడికి అవసరమైన భూమి మాత్రమే కాక.. ఆలయం నిర్మాణానికి అవసరమైన ఖర్చును కూడా కృష్ణారెడ్డే భరించారు. అవసరమైన భూమి, నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా తన సొంత నిధులతోనే భరించారు. ఆలయంలో పూజలు చేయడం కోసం పూజారిని నియమించి.. ఆయన కోసం ఇల్లు కట్టించి, జీతభత్యాలు అందించడమే కాక.. గుడికి కావాల్సిన దీప, ధూప, నైవేద్యాల ఖర్చులను కూడా ఆయనే భరిస్తున్నారు. అలానే ప్రతి సంవత్సరం కుమార్తె జయంతి, వర్ధంతి సందర్భంగా ఈ గుడిలో అన్నదానం నిర్వహిస్తున్నారు. చంద్రకళ బిడ్డను కృష్ణారెడ్డే పెంచుతున్నారు. మనవరాలి చిరునవ్వులో బిడ్డను చూసుకుంటున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa