ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవూఫ్‌పై నిప్పులు చెరిగిన పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్

sports |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 07:40 PM

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైన తర్వాత, ఆ జట్టు పేసర్ హరీస్ రవూఫ్‌పై పేస్ దిగ్గజం వసీం అక్రమ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. కీలకమైన మ్యాచ్‌లో రవూఫ్ భారీగా పరుగులు సమర్పించుకోవడాన్ని విమర్శించాడు. భారత్‌తో మ్యాచ్ అనగానే రవూఫ్ ఒక "రన్ మెషీన్"‌గా మారిపోతున్నాడని, అతని ప్రదర్శన ఏమాత్రం మెరుగుపడటం లేదని అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఈ విషయంపై ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడిన అక్రమ్, "దురదృష్టవశాత్తూ హరీస్ రవూఫ్ పరుగులు ఇవ్వడంలో ముందుంటున్నాడు. ముఖ్యంగా భారత్‌తో ఆడేటప్పుడు ఇది మరీ ఎక్కువైంది. ఈ విమర్శ ఒక్క నాది మాత్రమే కాదు, యావత్ పాకిస్థాన్ దేశం అతడిని విమర్శిస్తోంది" అని అన్నాడు. రవూఫ్ రెడ్ బాల్ క్రికెట్ ఆడకపోవడం వల్లే బౌలింగ్‌లో పట్టు సాధించలేకపోతున్నాడని, కనీసం నాలుగు లేదా ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడితే తప్ప ఆటలో మెరుగుదల ఉండదని స్పష్టం చేశాడు. అక్రమ్ అభిప్రాయంతో మరో పేస్ లెజెండ్ వకార్ యూనిస్ కూడా ఏకీభవించాడు.ఈ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కి అక్రమ్ పలు కీలక సూచనలు చేశాడు. "రెడ్ బాల్ క్రికెట్ ఆడని ఆటగాడికి బంతిపై నియంత్రణ ఉండదు. అలాంటి వారికి కృతజ్ఞతలు చెప్పి జట్టు నుంచి పంపేయాలి. ఈ విషయంలో పీసీబీ పునరాలోచించాలి" అని కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీ కూడా సరిగా లేదని, అతని నిర్ణయాలు కూడా ఓటమికి ఒక కారణమని విశ్లేషించారు.ఆసియా కప్ ఫైనల్‌లో రవూఫ్ వికెట్ తీయకుండా 50 పరుగులు ఇచ్చాడు. తిలక్ వర్మ, శివమ్ దూబె అతని బౌలింగ్‌లో చెలరేగి ఆడారు. రవూఫ్ వేసిన 15వ ఓవర్లో 17 పరుగులు, 18వ ఓవర్లో 13 పరుగులు రాబట్టారు. ఇక చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా, రవూఫ్ బౌలింగ్‌లోనే తిలక్ వర్మ సిక్స్, రింకు సింగ్ ఫోర్‌తో భారత్‌కు విజయాన్ని అందించారు. 2022 టీ20 ప్రపంచకప్‌లోనూ విరాట్ కోహ్లీ.. రవూఫ్ బౌలింగ్‌లోనే కీలక పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa