ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన ప్రతిష్ఠాత్మక పెట్టుబడుల సదస్సుపై చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 'రైజింగ్ ఏపీ' థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కుదిరిన ఒప్పందాల గురించి తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్మలా సీతారామన్‌ను ఆయన ఆహ్వానించారు.పెట్టుబడుల సదస్సుతో పాటు, రాష్ట్రంలో అమలవుతున్న అంత్యోదయ సంక్షేమ పథకాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అమలు చేస్తున్న కార్యక్రమాల తీరును, వాటికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa