కాన్పూర్‌లో వేలల్లో జీతం వచ్చే ఓ ఉద్యోగి కళ్లు చెదిరే ఆస్తులు సంపాదించాడు. ఎవరూ ఊహించని విధంగా 41 ఫ్లాట్లు కొనుగోలు చేసి కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేయించాడు. అయితే ఈ ఆస్తుల విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలా అని ఈయనేదో సైడ్ బిజినెస్ చేయడమో, తాతాలు సంపాదించిన ఆస్తులు వచ్చాయేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇదంతా ఆయన స్వయంగా.. అమాయక ప్రజల నుంచి లంచం తీసుకుని కూడబెట్టాడు. మరిదంతా ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందామా.
కాన్పూర్‌కు చెందిన అలోక్ దూబే.. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసేవారు. అయితే ఈయన చాలా కాలంగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ భూరికార్డులను మార్చడం, అక్రమ అమ్మకాల పత్రాలను సృష్టించడం, చట్టపరమైన పరిమితులు ఉన్న ఆస్తులపై కూడా వారసత్వ హక్కులను నమోదు చేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయాలు కాస్తా వెలుగులోకి రావడంతో.. పైఅధికారులు దీనిపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ADM (జ్యుడీషియల్), SDM (సదర్), ఏసీపీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ విచారణలో.. సింగ్‌పూర్ కథార్, రాంపూర్ భీమ్‌సేన్‌లోని రెండు వివాదాస్పద ప్లాట్‌లకు సంబంధించిన లావాదేవీలను దూబే సులభతరం చేశారని తేలింది. ఈ ప్లాట్లలో ఒకదాన్ని తరువాత ఒక ప్రైవేట్ సంస్థ అయిన ఆర్‌ఎన్‌జీ ఇన్‌ఫ్రాకు అమ్మడంతో.. ఈ మొత్తం కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసుపై 2025 మార్చిలో కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత శాఖాపరమైన విచారణ జరిగింది. ఈ విచారణలో దూబేపై నాలుగు ప్రధాన ఆరోపణలను నిర్ధారించారు. ఆగస్టులో జరిగిన వ్యక్తిగత విచారణలో.. దూబే సివిల్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, సంవత్సరాల తరబడి అనుమతి లేకుండా భూమి లావాదేవీలలో పాల్గొన్నారని విచారణ అధికారి గుర్తించారు. అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్) కూడా దూబే, ఆయన భార్య, పిల్లల పేర్ల మీద కాన్పూర్, ఢిల్లీ, నోయిడాలో రూ. 50 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయని నివేదించారు. మొత్తంగా 41 ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈక్రమంలోనే దూబేను పదవి నుంచి డీమోట్ చేశారు. అలాగే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా మరిన్ని ఆస్తులు ఉండొచ్చని కూడా అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు స్థానికులు దూబేకు మరింత ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన పేరిట 41 ఫ్లాట్లు కాదు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయని వివరిస్తున్నారు. రాబోయే రింగ్ రోడ్ ప్రాజెక్ట్ గురించి దూబేకు ముందస్తు సమాచారం రావడంతో.. డూల్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో భూమి ధరలు పెరగడానికి ముందే దాదాపు 56 ఆస్తులను కొనుగోలు చేశారని అంటున్నారు. ఈ చర్యలు ఆయన అవినీతికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్.. ఈ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa