ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుపైకి ఒక్కరే కారేసుకుని వచ్చారంటే ఫైన్ కట్టాల్సిందే

national |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 08:53 PM

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఇండియా ఐటీ క్యాపిటల్ బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే. నరకానికి నకలు అన్నట్లుగా ఉంటుంది అక్కడి ట్రాఫిక్. ఇక్కడి ట్రాఫిక్ రద్దీ ప్రపంచవ్యాప్తంగా కూడా వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లో గంటల తరబడి చిక్కుకోవడం అక్కడి ప్రజలు చాలా సాధారణం. ఈ ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు తాజాగా ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది అక్కడి ప్రభుత్వం. అదే కంజెషన్ ట్యాక్స్ అంటే రద్దీ పన్ను. అంటే రద్దీ తగ్గించేందుకు ఉద్దేశించిన పన్ను. రోడ్లపై రద్దీకి కారణమయ్యే వారిపై విధించే పన్ను అన్నమాట.


బైకులతో పోలిస్తే కార్లతో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. చాలా మంది ఒంటరిగానే కార్లలో రోడ్లపై తిరగడం, ఆఫీసులకు వెళ్లిరావడం చేస్తుంటారు. ఇలాంటి వారిని నియంత్రించడానికే ఈ కొత్త పన్నును తీసుకువచ్చే యోచన చేస్తోంది కర్ణాటక సర్కారు. ఔటర్ రింగ్ రోడ్, ఇతర ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్‌లో ఒక్కరే ప్రయాణించే వాహనదారులు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఈ ప్రణాళిక సూచిస్తోంది. అయితే, వాహనంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే వారికి ఈ పన్ను వర్తించదు. దీనివల్ల కార్ పూలింగ్‌ను ప్రోత్సహించి, రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.


ఈ పన్నును ఫాస్టాగ్ ద్వారా ఆటోమెటిక్‌గా వసూలు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ విధానం ఇంకా చర్చల దశలోనే ఉందని, దీని అమలుపై ఇంకా స్పష్టత లేదని అధికారులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. 2023లో కర్ణాటక 'విజన్ $1 ట్రిలియన్ ఎకానమీ' కమిటీ నగరంలోని 9 ప్రధాన రోడ్లలోకి ప్రవేశించే వాహనాలపై పన్ను విధించాలని సూచించింది.


ఈ కొత్త పన్ను అమలు వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, ప్రజలు కార్ పూలింగ్, ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా రవాణా, రోడ్డు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఉపయోగించవచ్చని అంటున్నారు.


అయితే ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ప్రజా రవాణా వ్యవస్థలు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని, ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులపై పన్నుల భారం మోపడం సరికాదని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయాలు లేకుండా ప్రజలను శిక్షించడం అన్యాయమని, ఇది కేవలం మధ్యతరగతి ప్రజలపై భారం మోపడమేనని మరికొందరు వాదిస్తున్నారు. ఈ పన్ను విధానాన్ని అమలు చేయాలంటే సాంకేతిక, చట్టపరమైన సవాళ్లు కూడా ఎదురవుతాయని.. పన్ను పరిధిలో ఉన్న ప్రాంతాలను, మినహాయింపులను స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.


ఈ పన్ను అమలు అయితే, ప్రజల ప్రయాణ శైలిలో మార్పులు వస్తాయని, పీక్ అవర్స్‌లో ప్రయాణాలు తగ్గుతాయని ఆశిస్తున్నారు. క్యాబ్ సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే క్యాబ్ సర్వీసులు తమ కస్టమర్లకు సేవలు అందంచడానికి ఒక్కరే కారులో వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, వారికి ఏమైన మినహాయింపు ఇస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa