ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హమాస్ అంగీకారం తర్వాత కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు

international |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 09:01 PM

యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరించి, బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం దాడులను ఆపడం లేదు. శనివారం రోజు కూడా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఫలితంగా ఆరుగురు మృతి చెందగా మరెంతో మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాల్పులను తక్షణమే ఆపాలని ట్రంప్ ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరిగగా.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


శనివారం రోజు గాజా స్ట్రిప్‌లో ఐడీఎఫ్ బాంబు దాడులు చేయడంతో మొత్తంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాజా సిటీలోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా, దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్‌లో జరిగిన మరో ఇద్దరు మరణించినట్లు వైద్య సిబ్బంది ధృవీకరించారు.


ఇజ్రాయెల్-హమాస్ మధ్య రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. హమాస్ "శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని" తాను నమ్ముతున్నానని శుక్రవారం రోజే ట్రంప్ ప్రకటించారు. దీని తర్వాత బాధ్యత నెతన్యాహు ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేస్తూ.. బందీలను సురక్షితంగా, త్వరగా బయటకు తీసుకురావాలంటే ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడిని ఆపాలని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ ప్రకటనను హమాస్ అభినందించింది. యుద్ధం ముగింపు, ఖైదీల మార్పిడి, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించుకోవడం వంటి వాటిపై వెంటనే చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.


మరోవైపు హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం కూడా స్పందించింది. బందీల విడుదల కోసం ట్రంప్ ప్రణాళికలోని మొదటి దశను తక్షణమే అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అయినప్పటికీ దేశ సైనిక కార్యకలాపాలను తగ్గిస్తారనే విషయంపై స్పష్టతను ఇవ్వలేదు. ఇజ్రాయెల్ సైనిక దళాల ప్రధానాధికారి కూడా ట్రంప్ ప్రణాళిక తొలి దశ అమలుకు సన్నద్ధతను పెంచాలని దళాలను ఆదేశించారు.


కానీ ఇదంతా జరిగిన కొన్ని గంటల్లోనే మళ్లీ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2023 అక్టోబర్ 7వ తేదీన జరిగిన హమాస్ దాడికి ప్రతిగా ప్రారంభమైన ఈ సైనిక చర్యలో.. మొత్తంగా 66,000 మందికి పైగా పౌరులు మరణించారు. సహాయ నిబంధనల కారణంగా గాజాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa