కరూర్ తొక్కిసలాట ఘటనలో దర్యాప్తు బృందం విచారణలో అవసరమని తేలితే, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌ను అరెస్టు చేయడానికి వెనుకాడబోమని తమిళనాడు మంత్రి, డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, అనవసర అరెస్టులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.వెల్లూరులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ దురైమురుగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "విజయ్‌కు నాయకత్వ లక్షణాలు లేవని న్యాయమూర్తి చెప్పడం సరైనదే. పరిస్థితులు ఆయన అరెస్టుకు దారితీస్తే, మేం తప్పకుండా అరెస్టు చేస్తాం" అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరమవుతున్న తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఈ ప్రమాదాన్ని మానవ తప్పిదంగా పరిగణించిన మద్రాస్ హైకోర్టు, దీనిపై తీవ్రంగా స్పందించింది. చెన్నై నార్త్ జోన్ ఐజీ అస్ర్రా గార్గ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు, కరూర్ సిటీ పోలీస్ స్టేషన్‌లోని దర్యాప్తు రికార్డులను చెన్నైకి తరలించి సిట్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైంది. దీంతో ఈ కేసు సాధారణ విచారణ స్థాయి నుంచి కోర్టు పర్యవేక్షణలో జరిగే ఉన్నతస్థాయి దర్యాప్తు దశకు చేరింది.ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యం ఆరోపణలపై ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్‌లపై ఐదు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే, హైకోర్టు అంతటితో ఆగకుండా, ఈ ఘటనలో విజయ్, ఇతర పార్టీ నిర్వాహకుల పాత్రపై కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ కరూర్ నుంచి వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.మరోవైపు, ప్రచార ర్యాలీకి సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలించిన నమక్కల్ జిల్లా పోలీసులు, విజయ్ ప్రచార బస్సును స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, బస్సును స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించడంతో, చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకోవాలని సంకేతాలిచ్చింది. ఈ పరిణామాలపై చెన్నైలో స్పందించిన డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి, "హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుంది" అని విశ్వాసం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa