ఓ దేశ రాజుగారు తన 15 మంది భార్యలు, పిల్లలను వెంటేసుకుని విదేశీ పర్యటనకు వచ్చారు. రాజు, ఆయన భార్యలు, వారి పిల్లలు, 100 మందికిపైగా సేవకులు ప్రత్యేక విమానంలో ల్యాండయ్యారు. ఈ అద్భుత దృశ్యం అబుదాబి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఆఫ్రికాలోని చిన్న దేశమైన ఎస్వాటిని (స్వాజిలాండ్)ను పాలించే కింగ్ ఎంస్వాటి III సకుటుంబసపరివార సమేతంగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ వీడియో జులైలో వెలుగులోకి వచ్చింది. ఎంస్వాటి III తన భార్యలు, పిల్లలతో సేవకులతో ప్రైవేట్ జెట్‌నుంచి దిగుతున్న దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ చిరుతపులి చర్మ డిజైన్‌లో ఉన్న దుస్తులను రాజు ధరించగా, ఆయన రాణులు రంగురంగుల ఆఫ్రికన్ దుస్తులతో మెరిసిపోయారు.
రాజు, ఆయన పరివారం రాకతో అబుదాబి విమానాశ్రయంలో కోలాహలం నెలకుంది. రాయల్ కాన్వాయ్ కోసం మూడు టెర్మినళ్లను విమానాశ్రయ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదిలా ఉండగా 1986లో రాజుగా బాధ్యతలు చేపట్టిన ఎంస్వాటి III ప్రపంచంలోని అత్యంత ధనిక రాజులలో ఒకరు కావడం విశేషం. ఆయన ఆస్తుల విలువ బిలియన్ డాలర్లు పైమాటే. ఈయనకు 15 మంది భార్యలు కాగా.. వారి ద్వారా 35 మంది సంతానం ఉన్నారు. అయితే, ఎంస్వాటి తండ్రి సొభుజా II మామూలోడు కాదు. ఆయన ఏకంగా 125 మంది భార్యలు, 210 మంది పిల్లలకు తండ్రిగా చరిత్ర సృష్టించారు.
ఏటా జరిగే ‘రీడ్ డ్యాన్స్’ అనే శతాబ్దాల నాటి పురాతన సంప్రదాయ ఉత్సవంలో కొత్త భార్యను రాజు ఎంచుకుంటారని చెబుతారు. కానీ, రాజుగారి భోగాలు వెనుక దేశంలోని కటిక పేదరికం, అసమానతలు, నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు. అక్కడ జనాభాలో దాదాపు 60 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. రాజు దుబాయ్ పర్యటన వీడియో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘రాజు కాన్వాయ్ మొత్తం గ్రామంలా ఉంది!’అని ఒకరు చమత్కరించగా.. ‘దేశం కష్టాల్లో ఉంటే రాజు ఇలా విలాసవంతంగా ఎలా ఉంటాడు?’ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతిక యుగంలోనూ రాచరిక పాలన కొనసాగడంపై పెదవి విరుస్తున్నారు. ప్రజలు కనీసం కరెంట్ సౌకర్యానికూడా నోచుకోవడం లేదు, జనం ఆకలితో చనిపోతుంటే ఈయన ప్రయివేట్ విమానంలో కులుకుతున్నాడని మండిపడుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం ‘భార్యలను మేనేజ్ చేయడానికి ఇంటిలో కో-ఆర్డినేటర్‌ను ఎవరనైనా నియమించారా’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌తో ఆర్థిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలపై చర్చించడానికే ఎంస్వాటి III దుబాయ్ పర్యటనకు విచ్చేశారు. అయితే ఆయన భార్యలు, సేవకులను వెంటేసుకుని అట్టహాసంగా వచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. ఎస్వాటినిలో నిరుద్యోగం 2021లో 23 శాతం నుంచి 33.3 శాతానికి చేరుకుంది. రాజుగారికి మాత్రం నిర్మాణ, పర్యటక, వ్యవసాయ, టెలికమ్యూనికేషన్, ఫారెస్ట్రీ రంగాల్లోని పలు పరిశ్రమల్లో వాటాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa