ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవుడే నాతో ఈ పని చేయించాడు': లాయర్ రాకేశ్ కిషోర్

national |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 08:25 PM

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై.. కోర్టులోనే షూ విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన చేసిన పనికి గాను ఇప్పటికే సస్పెండ్ కాగా.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. తన చర్యను సమర్థించుకుంటూనే.. తానేమి తాగి చెప్పు విసరలేదని వివరించారు. అలాగే ఈ ఘటనపై తానేమీ భయపడటం లేదని.. ఏమాత్రం పశ్చాత్తాప పడట్లేదని స్పష్టం చేశారు. ఈ చర్యకు దారి తీసిన కారణాలను వివరిస్తూ.. సుప్రీం కోర్టు, సీజేఐ చేసిన కొన్ని వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని ఆయన ఆరోపించారు.


సనాతన ధర్మం విషయంలో కోర్టు ప్రవర్తనపై తాను అసంతృప్తి చెందానని న్యాయవాది రాకేశ్ కిషోర్ తెలిపారు. ఈ ఘటనకు కారణమైన కీలక వ్యాఖ్య గురించి వివరిస్తూ.. సెప్టెంబర్ 16వ తేదీన కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందని అన్నారు. ఆ సమయంలో సీజేఐ దాన్ని విచారించారని.. ఆ సందర్భంగానే తీర్పునిస్తూ దానిని అపహాస్యం చేశారన్నారు. మీరు వెళ్లి విగ్రహానికి మొక్కి, ఆ విగ్రహాన్నే దాని తలను పునరుద్ధరించమని చెప్పండి అని సీజేఐ మాట్లాడినట్లు గుర్తు చేశారు. న్యాయస్థానంలో జరిగిన ఈ అవమానం తనను ఎంతగానో కలచివేసిందని న్యాయవాది చెప్పుకొచ్చారు. పిటిషనర్‌కు నచ్చే తీర్పు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ.. వారిని అపహాస్యం చేయొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.


 అంతేకాకుండా సుప్రీం కోర్టు సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలలో ఒక పద్ధతిలో, ఇతర అంశాలలో వేరే పద్ధతిలో వ్యవహరిస్తుందని కిషోర్ ఆరోపించారు. అలాగే తానేమీ మద్యం సేవించి చెప్పు విసరలేదని, ఇది సీజేఐ చర్యకు నా ప్రతిచర్య మాత్రమేనని పేర్కొన్నారు. దీని గురించి తానేమీ భయపడనని చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన దేనికీ.. తాను పశ్చాత్తాప పడను అని స్పష్ం చేశారు. అంతేకాకుండా.. ఈ చర్య కేవలం ఒక వ్యక్తిగత ఉద్రేకం కాదని.. న్యాయ వ్యవస్థలోని నిర్దిష్ట వైఖరిపై తాను చూపిన నిరసన అని పేర్కొన్నారు.


ఒక న్యాయవాదిగా, తాను శాంతియుతంగా సమస్యలను పరిష్కరించాలని కోరుకున్నప్పటికీ.. తరచుగా జరుగుతున్న మతపరమైన అంశాల అపహాస్యం తనను ఈ విధమైన చర్యకు ప్రేరేపించిందని ఆయన తెలిపారు. న్యాయమూర్తులు అత్యున్నత రాజ్యాంగ స్థానంలో ఉన్నప్పుడు.. వారు అన్ని మతాలు, భావోద్వేగాల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa