ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్‌ ఎన్నికల్లో ట్విస్ట్.. ప్రశాంత్ కిషోర్‌తో చిరాగ్ పాశ్వాన్ కూటమి?

national |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 08:26 PM

అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన బిహార్‌లో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. నితీశ్ నాయకత్వంలోని ఎన్డీయే, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుండగా.. సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాలు డిమాండ్లు కూటములను కలవరపెడుతున్నాయి. తాజాగా, ఎన్డీయేలో కీలక మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ.. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన సూరజ్‌తో జట్టుకట్టనుందనే వార్త చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, తలుపులు ఇంకా మూసుకుపోలేదని ఎల్జేజీ వర్గాలు చేసిన ప్రకటన అధికార ఎన్డీయే గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ, ఎల్జీపీల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోన్న తరుణంలో ఈ వార్త రావడం గమనార్హం.


లోక్‌ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ .. తమకు 40 సీట్లు కావాలని కోరుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో, 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీచేసిన ఐదు ఎంపీ స్థానాల్లో గెలిచామని, అందుకే తమకు 40 సీట్లు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. కానీ, బీజేపీ కేవలం 25 సీట్లు ఇస్తామని చెబుతోంది. కోరినన్ని సీట్లు ఇవ్వకుంటే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ప్రశాంత్ కిషోర్‌తో కలవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పాశ్వాన్-కిషోర్ కలయిక సాధ్యమా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి.


ఒకవేళ జన సూరజ్‌తో పొత్తు పెట్టుకోవడంలో అధిక స్థానాల్లో ఎల్జేపీ పోటీచేయడానికి అవకాశం కల్పిస్తుందది. కానీ ఈ పొత్తు ముఖ్యమంత్రి కావాలనుకుంటోన్న చిరాగ్ పాశ్వాన్ ఆశయాలకు మాత్రం సహకరించదు. ఎన్డీయే, మహాఘటబంధన్‌లకు పోటీగా అధిక స్థానాల్లో విజయం సాధించడం ఈ కూటమికి అంత సులభం కాదు. అయితే, కిషోర్‌తో కూటమి ఏర్పాటుపై ప్రచారంతో సీట్ల విషయంలో బీజేపీపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చనేది ఎల్జేపీ వ్యూహం. తమకు గౌరవప్రదమైన సీట్లు దక్కాల్సిందేనని కూడా ఎల్జేపీ పట్టుబడుతోంది. ఇదే విషయాన్ని చిరాగ్ సైతం స్పష్టం చేశారు. అయితే, ‘నేను కూరలో ఉప్పులాంటి వాడిని... ప్రతి నియోజకవర్గంలో 20,000- 25,000 ఓట్లపై ప్రభావం చూపగలను’ అని అన్నారు.


ఇక, జేడీయూ, బీజేపీలు సమంగా సీట్లు పంచుకుని సమష్టిగా పోటీకి దిగుతాయని ఆయా పార్టీ వర్గాల అంటున్నాయి. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది.. మొత్తం 243 సీట్లకు గాను బీజేపీ-జేడీయూలు 205 సమంగా పంచుకుంటాయని, మిగతా 38 సీట్లలోల లోక్ జన్‌శక్తి పార్టీ, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమత పార్టీలకు కేటాయించనున్నారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa