ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదర్సా బోర్డు రద్దు, అన్ని మైనారిటీ సంస్థలకు ఒకే చట్టం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 07:31 PM

ఉత్తరాఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో కీలక విధానపరమైన మార్పులకు తెరలేపింది. ఇటీవల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఉత్తరాఖండ్ మైనారిటీ ఎడ్యుకేషన్ బిల్లు 2025కు ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (రిటైర్డ్) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అది ఉత్తరాఖండ్ మైనారిటీ ఎడ్యుకేషన్ చట్టం 2025గా మారింది. వచ్చే ఏడాది జూలై 1వ తేదీ నుంచి ఈ చట్టం అమలులోకి రానున్నట్లు ఉత్తరాంఖండ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు అమల్లో ఉన్న మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం 2016.. నాన్ గవర్నమెంట్ అరబిక్ అండ్ పర్షియన్ మదర్సా గుర్తింపు నిబంధనలు 2019 అనే రెండు చట్టాలు.. 2026 జూలై 1వ తేదీ నుంచి ఆటోమేటిక్‌గా రద్దు కానున్నాయి.


అన్ని మైనారిటీ వర్గాలకు ఒకే చట్టం


అయితే ఈ కొత్త ఉత్తరాఖండ్ మైనారిటీ ఎడ్యుకేషన్ చట్టం ప్రవేశపెట్టడానికి ప్రధాన ఉద్దేశం మదర్సాల కోసం ఉన్న పాత విద్యా వ్యవస్థ స్థానంలో.. రాష్ట్రంలోని అన్ని మైనారిటీ విద్యా సంస్థలకు ఒకే రకమైన చట్టాన్ని తీసుకురావడమేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు కేవలం ముస్లిం వర్గానికి సంబంధించిన సంస్థలు మాత్రమే మైనారిటీ సంస్థలుగా అధికారికంగా గుర్తించగా.. తాజాగా తీసుకువచ్చిన చట్టంతో ముస్లిం సంస్థలతో పాటు సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ వంటి ఇతర మైనారిటీ వర్గాల విద్యా సంస్థలు కూడా ఇకపై ఒకే గుర్తింపు వ్యవస్థ పరిధిలోకి రానున్నాయి. ఇది అన్ని మైనారిటీ విద్యా సంస్థలకు సమాన హక్కులు, గుర్తింపును అందిస్తుందని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.


నూతన అథారిటీ ఏర్పాటు


ఈ కొత్త చట్టం ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని మైనారిటీ విద్యా సంస్థలను పర్యవేక్షించేందుకు ఒక అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ అథారిటీకి కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగించనున్నారు. మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు మంజూరు చేయడం.. ఆ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను నియంత్రించడం.. ఆ మైనారిటీ విద్యా సంస్థలు ఉత్తరాఖండ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయా లేదా అని నిర్ధారించడం.. విద్యార్థుల పరీక్ష పత్రాలకు సంబంధించిన మూల్యాంకనాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటం వంటి పనులు ఈ అథారిటీ చూసుకోనుంది.


ఇక ఉత్తరాఖండ్ మైనారిటీ ఎడ్యుకేషన్ చట్టం ఆమోదం పొందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ఎక్స్ ద్వారా ప్రకటించారు. గవర్నర్ ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారడానికి మార్గం సుగమమైందని తెలిపారు. పాత మదర్సా వ్యవస్థలో కేంద్ర స్కాలర్‌షిప్‌ల పంపిణీలో అవకతవకలు.. మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలు.. నిర్వహణలో పారదర్శకత లోపం వంటి అనేక సమస్యలు ఉన్నాయని గతంలోనే పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. ఈ కొత్త చట్టం ద్వారా.. మైనారిటీ విద్యా సంస్థల కార్యకలాపాలను ప్రభుత్వం సమర్థవంతంగా పర్యవేక్షించగలుగుతుందని.. దాని వల్ల రాష్ట్రంలో నాణ్యమైన విద్యతోపాటు.. సామాజిక సామరస్యం మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.


మదర్సా వ్యవస్థను.. మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంగా, నాణ్యతతో కూడినదిగా మార్చడానికి ఈ కొత్త చట్టం సహాయపడుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వివరించారు. ఈ ఉత్తరాఖండ్ మైనారిటీ ఎడ్యుకేషన్ బిల్లుకు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించగా.. గైర్‌సైన్‌లో జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం కల్పించారు. ఆ తర్వాత గవర్నర్ వద్దకు పంపించగా.. తాజాగా చట్టంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa