ఏపీలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక విధానాల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం గత 15 నెలల కాలంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఏపీలో 12 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కర్నూలు జిల్లాలో రూ.1700 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనుంది.
మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. ఈ 15 నెలల కాలంలో ఏడు మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు కర్నూలులోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభం కావటం విశేషం. ఇటు హైదరాబాద్, అటు బెంగళూరుకు సమాన దూరంలో ఉండటం కర్నూలు జిల్లాకు కలిసి వస్తోంది. కర్నూలు నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గంలో రావాలంటే మూడు గంటలు సమయం పడుతుంది. అలాగే కర్నూలు నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఐదు గంటలు పడుతుంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లావైపు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రోడ్డు మార్గం ద్వారా ఉత్పత్తుల రవాణా సులభంగా, వేగంగా జరపవచ్చనే ఆలోచనతో కర్నూలు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
తాజాగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లో సాఫ్ట్ డ్రింక్స్, పండ్ల రసాల ప్లాంట్ ఏర్పాటు చేయాలనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిపాదనను ఏపీ కేబినెట్ ఇటీవల ఆమోదించింది. ఈ ప్లాంట్‌ను దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా దాదాపు 1,200 మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా. పశువుల దాణా, గోతాముల తయారీలో ప్రముఖ సంస్థ ఒకటి గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 11 యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కంపెనీ దాదాపు రూ. 450 కోట్లతో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది.
కుప్పం నియోజకవర్గంలో రూ.250 కోట్లతో మహిళా స్వయం సహాయక బృందం పాడి, పశువుల దాణా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. అలాగే కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో రూ.430 కోట్లతో మదర్ డెయిరీ పండ్ల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. అలాగే ఏస్ ఇంటర్నేషనల్ రూ.750 కోట్లతో కుప్పం నియోజకవర్గంలో భారీ డెయిరీని ఏర్పాటు చేస్తోంది.
మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. పామాయిల్ తయారీలో ప్రముఖ సంస్థ ఒకటి రూ.250 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిఫైనరీ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఏబీఎస్ ప్రోటీన్స్ అనే సంస్థ రూ.400 కోట్లతో ఏపీలో చికెన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసిందని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లోక వేయి కోట్లు పెట్టుబడులు రాబట్టినట్లు మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa