ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్ నిర్ధారణలో విప్లవాత్మక అడుగేసిన పరిశోధకులు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 04:12 PM

ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణలో యూకే పరిశోధకులు ఒక విప్లవాత్మక ముందడుగు వేశారు. కేవలం రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ క్యాన్స‌ర్ క‌ణాల‌ను ముందుగానే పసిగట్టి, రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు మార్గం సుగమం అవుతుంది.యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ నార్త్ మిడ్‌లాండ్స్ (UHNM), కీలే, లాఫ్‌బరో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. వీరు "ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్‌ఫ్రారెడ్ (FT-IR) మైక్రోస్కోపీ" అనే టెక్నిక్‌ను ఉపయోగించి రక్తంలో ఒక్క క్యాన్సర్ కణం వున్నా కూడా దానిని విజయవంతంగా గుర్తించారు. రక్తంలో తిరుగుతూ ఉండే క్యాన్సర్ కణాలను (సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ - CTCs) ఈ పద్ధతి పసిగడుతుంది. ఈ కణాలు కణితి నుంచి విడిపోయి రక్తంలో ప్రయాణిస్తూ ఇతర భాగాలకు వ్యాధిని వ్యాపింపజేస్తాయి.ఈ టెక్నాలజీలో రక్త నమూనాపై శక్తిమంతమైన ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేస్తారు. క్యాన్సర్ కణాలు ఈ కాంతిని ప్రత్యేకమైన రీతిలో గ్రహిస్తాయి. దీనివల్ల వాటికంటూ ఒక "కెమికల్ ఫింగర్‌ప్రింట్" ఏర్పడుతుంది. కంప్యూటర్ విశ్లేషణ ద్వారా ఈ ఫింగర్‌ప్రింట్‌ను గుర్తించి రక్తంలో క్యాన్సర్ కణాల ఉనికిని నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఉన్న పద్ధతులతో పోలిస్తే ఇది చాలా సులభం, వేగవంతమైనది, ఖర్చు కూడా తక్కువ."ఈ విధానం వల్ల రోగులకు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, వారికి తగ్గట్టుగా చికిత్స అందించడం సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఈ టెక్నిక్‌ను ఊపిరితిత్తుల క్యాన్సర్‌కే కాకుండా ఇతర రకాల క్యాన్సర్ల నిర్ధారణకు కూడా విస్తరించే అవకాశం ఉంది" అని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జోసెప్ సులే-సుసో తెలిపారు. ఈ పరిశోధన వివరాలు "అప్లైడ్ స్పెక్ట్రోస్కోపీ" జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, ఈ పరీక్షను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa