భారత్ పొరుగున ఉన్న అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో సైనిక ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రాజధాని కాబూల్ సహా అఫ్గన్ భూభాగంపై అక్టోబరు 10న పాక్ వైమానిక దాడులకు తాలిబన్లు తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారు. హెల్మాండ్ ప్రావిన్సుల్లో తాలిబన్ సేనల దాడిలో 15 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయారు. హెల్మాండ్ ప్రావిన్సుల ప్రభుత్వం అధికార ప్రతిని మౌలావీ మొహమ్మద్ ఖాసిమ్ రియాజ్ మీడియాతో మాట్లాడుతూ.. బహ్రమ్‌పూర్ జిల్లాలోని డ్యూరాండ్ రేఖ సమీపంలో శనివారం రాత్రి అఫ్గన్ సైన్యం జరిపిన ప్రతిదాడుల్లో 15 మంది పాకిస్థాన్ సైనికులు హతమైనట్టు తెలిపారు. అంతేకాదు, మూడు పాకిస్తాన్ సైనిక ఔట్‌పోస్ట్‌లను తాలిబన్ ఆర్మీ స్వాధీనం చేసుకుని, భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేజిక్కించుకుందని పేర్కొన్నారు. తొలిసారి తాలిబన్ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలోనే కాబూల్‌పై పాక్ వైమానిక దాడులు చేయడం గమనార్హం.
రెండు రోజుల కిందట అఫ్గన్ రాజధాని కాబూల్, పక్తిక ప్రావిన్సుల్లో పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. హెల్మాండ్, కాందహార్, జబూల్, పక్తిక, పక్తియా, ఖోస్ట్, నంగర్‌హర్, కునార్ ప్రావిన్సుల సరిహద్దుల్లోని పాకిస్థన్ సైనిక పోస్ట్‌లపై అఫ్గన్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. గురువారం కాబూల్, పక్తిక ప్రావిన్సుల్లో మూడుచోట్ల పేలుళ్లు సంభవించాయి. తమ సార్వభౌమాధికారంపై ఇస్లామాబాద్ దాడిచేసిందని తాలిబన్ రక్షణ మంత్రి ఆరోపించారు.
‘‘పాకిస్థాన్ ఆర్మీ కాబూల్‌పై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం మొదలుపెట్టాం.. వివిధ ప్రాంతాల్లో పాకిస్థాన్ భద్రతా బలగాలు, తాలిబన్ సైన్యం మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి’’ అఫ్గన్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అఫ్గన్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఎనాయత్ ఖ్వారాజ్మ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. మేము చేపట్టిన ఆపరేషన్ శనివారం రాత్రి విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ‘‘ప్రత్యర్థి పక్షం మళ్లీ అఫ్గనిస్థాన్ భూభాగంపై ఉల్లంఘనలకు పాల్పడితే మా సాయుధ దళాలు తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.. దృఢంగా ప్రతిస్పందిస్తాయి’’ అని హెచ్చరించారు. కాగా, గురువారం నాటి కాబూల్ దాడులను పాకిస్థాన్ మాత్రం ధ్రువీకరించలేదు. కానీ, పాకిస్థాన్ తాలిబన్లను తమ దేశంలోకి పంపడం ఆపాలని కోరింది. మరోవైపు, భారత్, అఫ్గన్ మైత్రిపై దాయాది అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
కాబుల్‌లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరమే లక్ష్యంగా పాక్ వైమానిక దాడులు జరిపినట్టు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు. టీటీపీను పాకిస్థాన్ తాలిబన్లుగా వ్యవహరిస్తారు. ఇది తాలిబన్లకు సైద్ధాంతిక మిత్రుడే కాగా.. 2001 నుంచి 2021 మధ్య సంఘర్షణ సమయంలో వారికి సహకరించింది. అయితే, టీటీపీ ఉగ్రవాదులు 2021 నుంచి వందలాది మంది తమ సైనికులను హతమార్చారని పాక్ ఆరోపిస్తోంది. ‘ఈ సాయంత్రం తాలిబన్ దళాలు ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించాయి.. సరిహద్దు వెంబడి నాలుగు పాయింట్ల వద్ద మేము మొదట తేలికపాటి తరువాత భారీ ఫిరంగులను ప్రయోగించాం’ అని అన్నారు.
‘‘పాక్ దళాలు భారీ కాల్పులతో స్పందించి, పేలుడు పదార్థాలను మోసుకెళ్తున్నాయని అనుమానిస్తున్న మూడు ఆఫ్ఘన్ క్వాడ్‌కాప్టర్లను కూల్చివేశాయి. తీవ్రమైన పోరాటం కొనసాగుతోంది, కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు’ అని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa