2023 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరమైన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, ఎట్టకేలకు తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పర్యటనకు తన ఎంపిక చేయకపోవడంపై అతను చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని, అయితే జట్టులోకి తీసుకోవడం తన చేతుల్లో లేదని షమీ స్పష్టం చేశాడు.బుధవారం నుంచి ఉత్తరాఖండ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగుతున్నాడు. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన అతను, "నాలో ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే ఇక్కడ ఉండేవాడిని కాదు. నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు, 50 ఓవర్ల మ్యాచ్ కూడా ఆడగలను" అని ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియాకు తనను ఎంపిక చేయకపోవడంపై షమీ సూటిగా స్పందించాడు. "జట్టులో చోటు దక్కకపోవడం నా తప్పు కాదు. నా పని సిద్ధమవడం, మ్యాచ్‌లు ఆడటం మాత్రమే. అవకాశాలు వచ్చినప్పుడల్లా నేను బెంగాల్ తరఫున ఆడాను. నన్ను ఎంపిక చేస్తే ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో ఎలాంటి సమస్య లేదు" అని అన్నాడు.అంతేకాకుండా, తన ఫిట్‌నెస్ గురించి సెలక్టర్లకు లేదా జట్టు యాజమాన్యానికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తనపై లేదని షమీ తేల్చిచెప్పాడు. "నా ఫిట్‌నెస్‌పై ఎవరికీ అప్‌డేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అది నా బాధ్యత కాదు. నా పని నేను చేస్తాను. అప్‌డేట్స్ ఎప్పుడు ఇవ్వాలనేది యాజమాన్యం లేదా సెలక్టర్లు నిర్ణయిస్తారు" అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైనా, ఈ విరామాన్ని పూర్తిగా కోలుకోవడానికి ఉపయోగించుకున్నానని షమీ తెలిపాడు. "గాయంతో బాధపడుతూ జట్టును ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సర్జరీ తర్వాత బలంగా తిరిగి రావాలనుకున్నాను. గత రెండున్నర నెలలుగా కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. సుదీర్ఘ స్పెల్స్ వేశాను. ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాను" అని వివరించాడు. దేశం గెలవడమే ముఖ్యమని, జట్టు కోసం అత్యుత్తమ బౌలర్లనే ఎంపిక చేయాలని అతను అభిప్రాయపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa