ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి దిశగా మంగళవారం కీలక అడుగులు పడ్డాయి. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఇంతటి చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే డేటా సెంటర్ ఏర్పాటు వలన పర్యావరణానికి ప్రమాదమనే వాదనలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మీద ఏ పార్టీ, ఆ పార్టీకి అనుగుణంగా వాదనలు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే లోక్‌సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ స్పందించారు. ఏపీ ప్రభుత్వం, గూగుల్ సంస్థ ఒప్పందం తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు. గూగుల్ ఏఐ హబ్‌ను విశాఖపట్నానికి తీసుకురావడం గొప్ప విజయం. ఇది భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన దిశగా గొప్ప అడుగు. దీనిని సులభతరం చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే పెట్టుబడులు, మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులపైనా దృష్టి పెట్టాలి. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు.. ఖర్చులను తగ్గించుకోవటంపై దృష్టి పెట్టాలి. "
"ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆదాయాలు కూడా తదనుగుణంగా పెరుగుతాయి. అయితే ఖర్చులను కొన్ని సంవత్సరాలు స్తంభింపజేయడం వల్ల పబ్లిక్ డెబిట్ నిర్వహించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం, ఆఫ్ బడ్జెట్ రుణాలు, చెల్లించని బిల్లులను చేర్చినప్పుడు, రుణ-జిఎస్‌డిపి నిష్పత్తి 60 శాతం మించిపోయింది. పెట్టుబడిని ఆకర్షించడంలో, మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మాదిరిగానే ఆర్థిక నిర్వహణ, వనరులను వివేకవంతంగా ఉపయోగించడంలో ప్రభుత్వం అదే చైతన్యాన్ని చూపిస్తుందని నేను ఆశిస్తున్నా" అంటూ జయప్రకాష్ నారాయణ ట్వీట్ చేశారు.
మరోవైపు గూగుల్ - ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే ఐదేళ్లలో గూగుల్ ఏపీలో రూ.1.31 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుచేయనుంది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం ప్రస్తుతానికి రూ.87,250 కోట్లుగా గూగుల్ ప్రకటించింది. అయితే దీనిని 15 బిలియన్ డాలర్లకు తీసుకెళ్తామని వెల్లడించింది. గూగుల్ ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నం నుంచి సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా వంటి 12 దేశాలతో అనుసంధానం చేస్తూ సబ్ సీ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు గూగుల్ ఏఐ హబ్ ద్వారా సుమారుగా 1,88,220 ఉద్యోగాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa