ప్రస్తుతం దేశం మొత్తం బిహార్ రాష్ట్రం వైపే చూస్తోంది. త్వరలోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాజకీయం హీటెక్కింది. ఇక ఎన్డీఏ, ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాట్లు పూర్తి కావడంతో.. ప్రచారంపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే విజయంపై రెండు కూటములు ధీమాగా ఉన్నాయి. ఇక సీట్ల పంపకాల్లో ఎన్డీఏ కూటమిలో విబేధాలు వచ్చాయని వార్తలు వస్తున్న వేళ.. కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. సూపర్ విక్టరీ సాధిస్తుందని తేల్చి చెప్పారు. ఇక తమ కూటమిలో ఎలాంటి వివాదాలు లేవని.. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఇక తమకు దీపావళి ఇప్పుడు కాదని.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న రోజే తమకు అసలైన దీపావళి అంటూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.
సీట్ల సర్దుబాటు విషయంలో ఎన్ని ఊహాగానాలు వచ్చినా.. ఎన్డీఏ కూటమిలో అన్నీ సజావుగా జరిగాయని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎన్డీఏలో సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఖరారు విషయంలో ఎన్ని గందరగోళాలు వచ్చినా.. అన్నీ చాలా సులభంగా పరిష్కారం అవుతాయని తాను పదేపదే చెబుతున్నానని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బందన్ కూటమి ఒక గందరగోళ కూటమి అని తీవ్ర విమర్శలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం దిశగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తోందని తాను ధీమాగా చెబుతున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోనే తాము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్నామని తేల్చి చెప్పిన చిరాగ్ పాశ్వాన్.. తనకు కూటమిలోని ఏ ఒక్క భాగస్వామ్య పార్టీతో కూడా ఒక్క శాతం వివాదం లేదని స్పష్టం చేశారు. నవంబర్ 14వ తేదీన ఎన్డీఏ కూటమి నిజమైన దీపావళిని చేసుకుంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల విజయంపై చిరాగ్ పాశ్వాన్ పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో జరగనుంది. తొలి దశ ఎన్నికలు నవంబర్ 6వ తేదీన జరగనుండగా.. నవంబర్ 11వ తేదీన రెండో దఫా ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక నవంబర్ 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇక బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇటీవలే ఎన్డీఏ కూటమిలో పార్టీలు సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకున్నాయి. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలు అయిన బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి.
ఇక చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) 29 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. హిందుస్థాన్ అవామ్ మోర్చాకు 6 స్థానాలు.. రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి 6 స్థానాల్లో అవకాశం ఇచ్చారు. ఇక చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ(ఆర్) పార్టీకి 29 స్థానాలు కేటాయించగా.. అందులో ఇప్పటికే 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa