ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 04:30 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రో‌ల్ రూములను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎవరికైనా సహాయం అవసరమైతే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించాలని సూచించారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే చెట్ల కింద నిలబడవద్దని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం రోజున తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.అలాగే బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా భారీ వానలు పడే అవకాశం ఉందని.. బుధవారం రోజున ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేయనున్నట్లు వెల్లడించింది.


తిరుమలలో భారీ వర్షం..


మరోవైపు మంగళవారం రోజున తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తడిచి ముద్దయ్యాయి. అలయం ముందు కూడా నీరు నిలిచింది. మరోవైపు వాన ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనం, గదులు, లడ్డూల కోసం వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి.


మరోవైపు భారీ వానలతో ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో టీటీడీ అప్రమత్తమైంది. ఆకాశగంగ, పాపవినాశనం, శ్రీవారి పాదాలతో పాటుగా ఘాట్‌ రోడ్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మరోవైపు నెల్లూరులో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో గాంధీబొమ్మ సెంటర్‌, పొగతోట భగత్‌సింగ్ కాలనీలో నీరు రోడ్లపై నిలిచింది. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa