ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజూ అంజీర తింటే మీ శరీరంలో జరిగే పరిణామాలివే

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 09:25 PM

రెగ్యులర్ గా పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కో పండుతో ఒక్కో ప్రయోజనం ఉంటుంది. అందుకే అన్ని రకాల ఫ్రూట్స్ తప్పనిసరిగా తినాలని సూచిస్తుంటారు వైద్యులు. అందులో ఎక్కువ మంది సూచించేది అంజీర. దీన్ని ఇంగ్లీష్ లో ఫిగ్ అని పిలుస్తారు. చూడడానికి చాలా చిన్నగా కనిపించే ఈ పండు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.


నిజానికి ఎన్నో ఏళ్లుగా పవర్ ఫుల్ డైట్ ఫాలో అవుతున్న వారి ఛార్ట్ లో తప్పకుండా ఉండి తీరుతుంది ఈ అంజీర. పచ్చిగా తిన్నా, ఎండిన తరవాత తిన్నా సరే అందులోని పోషకాలు సరైన విధంగా శరీరానికి అందుతాయి. రోజువారీ డైట్ లో అంజీరని యాడ్ చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు పొందవచ్చు. మరి అంజీర వల్ల ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి. ఈ వివరాలు తెలుసుకుందాం.


జీర్ణ శక్తి పెంచడానికి


సాధారణంగా ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకున్నప్పుడు జీర్ణం త్వరగా అవుతుంది. డైజేషన్ సిస్టమ్ బాగుంటుంది. ఈ విషయంలో అంజీర ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంజీరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ కారణంగా మోషన్ ఫ్రీగా అవడంతో పాటు మలబద్ధకం తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. రెగ్యులర్ గా అంజీర తినడం వల్ల బాడీ డిటాక్స్ అవడంతో పాటు గట్ హెల్త్ కూడా మెరుగవుతుంది.


అంజీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అదే సమయంలో బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఫలితంగా హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అంజీరలో ఫినాలిక్ కంపౌండ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్త సరఫరాని మెరుగ్గా ఉంచుతాయి.


వెయిట్ మేనేజ్ మెంట్


​చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. ఎలాంటి డైట్ ఫాలో అయినా సరే అందులో తప్పనిసరిగా అంజీర ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. వెయిట్ మేనేజ్ మెంట్ లో ఇది ఎంతో బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా త్వరగా కడుపు నిండినట్టు అవుతుంది. ఫలితంగా అనారోగ్యకరమైన ఆకలి తగ్గుతుంది. ఇదే బరువు తగ్గడానికి సహకరిస్తుంది. అయితే ఇక్కడ కచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే...అంజీర ఆరోగ్యానికి మంచిదే అయినా మోతాదు ఎంత తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. మరీ అతిగా వీటిని తినకూడదు. ఎండు అంజీర పండ్లు తినడం వల్ల వెయిట్ మేనేజ్ మెంట్ సరైన విధంగా ఉంటుంది. ముఖ్యంగా మెటబాలిజం మెరుగవడంలో సహకరిస్తుంది.


ఎముకల బలానికి


ఎముకల బలానికి కూడా అంజీర ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ మూడు మినరల్స్ చాలా అవసరం. రోజూ అంజీర తినడం వల్ల బోన్ డెన్సిటీ పెరుగుతుంది. అంతే కాదు. ఎముకలకు సంబంధించిన వ్యాధులు, సమస్యలు రాకుండా ఉంటాయి. స్కెలిటల్ స్ట్రక్చర్ మెరుగ్గా ఉంటుంది.


పైగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అంజీరకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే..వీటిని తిన్నప్పుడు రక్తంలో షుగర్ ఎక్కువ మొత్తంలో విడుదల కాదు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగవు. పైగా ఫైబర్ కూడా ఉండడం వల్ల చాలా నెమ్మదిగా షుగర్ విడుదలవుతుంది. అంతే కాదు. కొన్ని అధ్యయనాల ప్రకారం అంజీర ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్ గా అంజీర తీసుకుంటే బెటర్. కాకపోతే మోతాదు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.


సంతాన సమస్యలకు


చాలా మంది సంతాన సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు రెగ్యులర్ గా అంజీర తీసుకుంటే ఈ సమస్యలు తగ్గిపోతాయి. అందుకు కారణం ఏంటంటే..అంజీరలో జింక్, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ ఉత్పత్తికి సహకరిస్తాయి. అంతే కాకుండా పునరుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కేవలం మహిళల్లోనే కాదు. పురుషుల్లోనూ ఫర్టిలిటీ సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇక ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, ఇ, సి అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. రెగ్యులర్ గా అంజీర తీసుకుంటే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. మొటిమలు, పిగ్మంటేషన్ లాంటివీ తగ్గుతాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి అయినా వీటిలోని పోషకాలు కాపాడతాయి. అందులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి.


ఎలా తినాలి


ఒకటి లేదా రెండు ఎండు అంజీరాలు తీసుకోవాలి. వాటిని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున వాటిని తీసుకోవాలి. వీటిని నేరుగా కూడా తినవచ్చు. లేదా సలాడ్స్ లో కలిపి తినాలి. మరో రకంగా కూడా వీటిని తీసుకోవచ్చు. పాలల్లో అంజీర వేసి బాగా మరిగించాలి. ఈ పాలను నిద్రపోయే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పట్టడంతో పాటు జీర్ణ శక్తి కూడా మెరుగవుతుంది. డిసర్ట్స్ తయారు చేసినప్పుడు అందులో రిఫైన్డ్ షుగర్ వాడే బదులుగా అంజీర వేస్తే చాలా మంచిది. ఇది నేచురల్ స్వీట్ నర్ లా పని చేస్తుంది. ఎండు అంజీరాలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒకటి లేదా రెండుకు మించి తినకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa