ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణాచల్ సమీపంలో 36 ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్లు,,,చైనాతో భారత్‌కు మరో కొత్త తలనొప్పి

national |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 09:02 PM

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌కు కేవలం 107 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిబెట్‌లోని లున్జె ఎయిర్‌బేస్‌లో చైనా భారీస్థాయిలో సైనిక మౌలిక సదుపాయాలను నిర్మించింది. తాజాగా వెలువడిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. ఈ స్థావరంలో 36 పటిష్టమైన ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిలిపి ఉంచేందుకు షెల్టర్లు నిర్మించింది. వీటితోపాటు పరిపాలనా భవనాలు, అత్యాధునిక ఏప్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భారత్-చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయి.. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్న వేళ.. ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం మళ్లీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి.


అక్టోబర్ 17వ తేదీన వెలువడిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. లున్జె ఎయిర్‌బేస్‌లో మొత్తం 36 విమానాలకు ఆశ్రయం ఇచ్చేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఏప్రిల్ 2వ తేదీన అక్కడ నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అవి పూర్తి కావడం చైనా వేగానికి నిదర్శనంగా మారాయి. ఇక ఇది భారత్‌కు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయని.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఈ పరిణామంపై స్పందించిన రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా.. లున్జెలో 36 విమానాల ఆశ్రయాల నిర్మాణం అనేది.. భవిష్యత్‌లో సరిహద్దుల్లో ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు ఎదురైతే.. టాక్టికల్ ఫైటర్లు, అటాకింగ్ హెలికాప్టర్లు ఇక్కడి నుంచే పనిచేయడానికి చైనా సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా సూచిస్తుందని పేర్కొన్నారు. 2017లో డోక్లామ్ సంఘటన సమయంలో.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌కు వచ్చిన సమస్య విమానాలు లేక కాదని.. వాటిని మోహరించడమేనని తాను తన సిబ్బందితో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. టిబెట్‌లో పటిష్టమైన ఆశ్రయాలను చైనా నిర్మించడం మొదలుపెడితే.. దాని అర్థం డ్రాగన్ భారత్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లేనని ధనోవా అప్పుడే చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.


ఈ పటిష్ట ఆశ్రయాలు భారత వైమానిక దాడులు లేదా క్షిపణి దాడుల నుంచి చైనా విమానాలను రక్షిస్తాయని.. వైమానిక స్థావరాన్ని నాశనం చేయడం భారత్‌కు మరింత సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. తాజా ఫోటోలు లున్జె టార్మాక్‌పై సీహెచ్-4 డ్రోన్‌లు ఉన్నట్లు సూచిస్తున్నాయని తెలిపారు. ఈ డ్రోన్ 16 వేల అడుగుల ఎత్తు నుంచి.. గగనతలం నుంచి ఉపరితలానికి క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉందని వెల్లడించారు. లున్జె, టింగ్రి, బురాంగ్ వంటి స్థావరాలు లైన్ ఆఫ్ కంట్రోల్‌ (ఎల్ఏసీ)కి 50-150 కిలోమీటర్ల పరిధిలో ఉండటం వల్ల.. సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో చైనా తన వైమానిక ఆస్తులను తక్కువ సమయంలోనే మోహరించడానికి వీలు కల్పిస్తుందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా పేర్కొన్నారు.


ఎత్తైన ప్రదేశాల్లో వైమానిక కార్యకలాపాల నిర్వహణలో భారత్‌కు గతంలో ఉన్న స్వల్ప ప్రయోజనం ఇప్పుడు ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణం వల్ల తగ్గుముఖం పడుతోందని మాజీ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్పీ ధార్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


చైనా వైపు నుంచి పెరుగుతున్న డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు.. భారత్ కూడా తన సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటోంది. ఇందులో భాగంగానే భారత్ 3.5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ తయారుచేసిన అత్యంత సామర్థ్యం గల స్కై గార్డియన్ డ్రోన్‌లను కొనుగోలు చేస్తోంది. 2029 నాటికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీలు ఈ డ్రోన్‌లను అందుకోనున్నాయి. ఇవి నిఘా, నిఘా సామర్థ్యాలను, ప్రెసిషన్ స్ట్రైక్ మిషన్లను బలోపేతం చేస్తాయి.


లున్జె వద్ద జరిగిన ఈ పరిణామం, చైనా హిమాలయ సరిహద్దు వెంబడి 6 కొత్త వైమానిక స్థావరాలను అప్‌గ్రేడ్ చేసే ప్రణాళికలో భాగమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ వైమానిక స్థావరాల ఆధునీకరణ ప్రాంతంలో కొత్త వ్యూహాత్మక వాస్తవికతను తెలియజేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa