తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కావేరి డెల్టా ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు, వరద నష్టాల విషయంలో ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రైతుల జీవితాల పట్ల ఉదాసీనత చూపుతూ వారిని మోసం చేస్తోందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ధ్వజమెత్తారు.డెల్టా ప్రాంతాన్ని ముంచెత్తుతున్న ఎడతెరిపిలేని వర్షాలు వరి పంటలను నాశనం చేయడమే కాకుండా, డీఎంకే ప్రభుత్వ అసమర్థతను, నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయని విజయ్ అన్నారు. నీటికి నాని మొలకెత్తిన ధాన్యం గింజల్లాగే, డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో నిరసన కూడా మొలకెత్తి, పెరిగి, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తుంది" అని ఆయన హెచ్చరించారు.కురుస్తున్న వర్షాల నుంచి మిగిలిన ధాన్యం నిల్వలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తక్షణ చర్యలు తీసుకోలేకపోయిందని విజయ్ ప్రశ్నించారు. "రైతులపై నిజంగా శ్రద్ధ ఉన్న ప్రభుత్వం వారి జీవనోపాధిని కాపాడటానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ, రైతులు కష్టపడి పండించిన పంట వర్షానికి కుళ్లిపోయేలా చేసి పేద రైతులను అణిచివేస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న పేద రైతులకు సకాలంలో కొనుగోళ్లు, గిట్టుబాటు ధర లభించే వ్యవస్థ ఉండాలని విజయ్ నొక్కి చెప్పారు. "ప్రతి ఏటా ఇదే దయనీయ పరిస్థితి పునరావృతమవుతోంది. రైతులు తమ పంటను అమ్ముకొని సంపాదించుకోకుండా స్టాలిన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందా" అని ఆయన నిలదీశారు.డెల్టా ప్రాంత ప్రయోజనాలకు తామే కాపలాదారులమని డీఎంకే చెప్పుకోవడాన్ని విజయ్ ఎద్దేవా చేశారు. "స్టాలిన్ తాను డెల్టా బిడ్డనని గొప్పలు చెప్పుకుంటారు, కానీ ఏటా రైతుల పంటలు వర్షాలకు నాశనమవుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది. ఇలాంటి నష్టాలను నివారించడానికి ముందస్తు చర్యలు ఉండక్కర్లేదా పండించిన ధాన్యాన్ని కాపాడటానికి నిల్వ సౌకర్యాలు మెరుగుపరచవద్దా అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.నిల్వ ఉంచిన బస్తాల్లోనే ధాన్యం మొలకెత్తినట్లే, డీఎంకేపై ప్రజా వ్యతిరేకత కూడా ప్రజల మనసుల్లో మొలకెత్తడం ప్రారంభమైందని, ఈ అసంతృప్తి త్వరలోనే బలపడి ప్రజా వ్యతిరేక పాలకులను ఇంటికి పంపిస్తుందని విజయ్ అన్నారు. రైతు వ్యతిరేక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసి, ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో పంటలను, ప్రజలను కాపాడటానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa