ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డయాబెటిస్, ఊబకాయం, గుండె సమస్యలుంటే అమెరికా వీసా క్యాన్సిల్

international |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 09:56 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వలస విధానంలో మరో కీలక, కఠినమైన మార్పును తీసుకొచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్ , ఊబకాయం, హృద్రోగ సమస్యలతో బాధపడే విదేశీయుల వీసా దరఖాస్తులను తిరస్కరించడానికి వీసా అధికారులకు మరింత విస్తృత అధికారాలను కట్టబెట్టారు. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడకుండా చూసే లక్ష్యంతో అమెరికా విదేశాంగ శాఖ ఈ సంచలన మార్గదర్శకాలను అన్ని ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు జారీ చేసింది. సాధారణంగా వీసా దరఖాస్తుల్లో టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయో లేదో మాత్రమే స్క్రీనింగ్ చేస్తారు. అయితే.. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిధి భారీగా పెరగనుంది. దీర్ఘకాలిక రోగాలను ఈ జాబితాలో చేర్చడం ద్వారా.. వలసదారుల వైద్య చరిత్రపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు.


అమెరికా వీసా దరఖాస్తు చేసుకునేవారి ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు.. క్యాన్సర్, డయాబెటిస్, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారి సంరక్షణకు లక్షల డాలర్ల ఖర్చు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఊబకాయం వల్ల ఆస్తమా, హై బీపీ వంటి సమస్యలు వచ్చి వైద్య ఖర్చులు పెరుగుతాయని.. అందుకే ఊబకాయాన్ని కూడా ఇందులో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వలసదారులు తమ జీవితకాలంలో ప్రభుత్వ నగదు సహాయం లేదా దీర్ఘకాలిక సంరక్షణపై ఆధారపడకుండా.. మెడికల్ ట్రీట్‌మెంట్‌ను సొంతంగా భరించగలరా లేదా అనే సామర్థ్యాన్ని కూడా వీసా అధికారులు కచ్చితంగా అంచనా వేయాలని సూచించారు.


వీసా దరఖాస్తుదారుల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు.. వారిపై ఆధారపడిన పిల్లలు లేదా వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను కూడా వీసా సమయంలో సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. వారి సంరక్షణ అవసరాల కారణంగా.. వీసా దరఖాస్తుదారుడు ఉద్యోగంలో నిలకడగా కొనసాగగల సామర్థ్యంపై ప్రభావం పడుతుందేమోనని అంచనా వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


మరోవైపు.. అమెరికాలోకి ఇతర దేశాల నుంచి వచ్చే వలసలను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం విస్తృత ప్రచారంలో భాగంగా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకువచ్చింది. ఇప్పటికే విదేశీ విద్యార్థుల డ్యురేషన్ ఆఫ్ స్టేపై పరిమితులు విధించడం.. హెచ్-1బీ వీసా కొత్త దరఖాస్తులపై అదనంగా లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.88 లక్షల ఫీజును విధించడం వంటి కఠిన చర్యలు అమలులో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్లాలి అనుకునే లక్షలాది మంది వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa