ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:07 PM

యువత మంచి ఆలోచనలతో ముందుకు వస్తే, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 175 నియోజకవర్గాల్లో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి, లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన ప్రకటించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మరో 17 జిల్లాల్లో రూ.873 కోట్ల వ్యయంతో 868 ఎకరాల్లో అభివృద్ధి చేసిన 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం పలు జిల్లాల పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఈ రోజు 99 కంపెనీలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. వీటి ద్వారా రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులతో 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. జనవరి నాటికి మరో 70 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తాం. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే మా లక్ష్యం అని సీఎం వివరించారు. టెక్నాలజీ భవిష్యత్తును శాసిస్తుందని, అందుకే అమరావతిలో జనవరికి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. సౌర విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్, బయో ఫ్యూయెల్ ప్లాంట్ల ఏర్పాటుతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, త్వరలోనే సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, తద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం విడిచి పారిపోయారని, పరిశ్రమలు మూతపడ్డాయని చంద్రబాబు విమర్శించారు.గతంలో పారిశ్రామికవేత్తలు 'ఛలోఛలో' అంటూ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే, ఇప్పుడు 'భలేభలే' అంటూ తిరిగి వస్తున్నారు. విశాఖకు గూగుల్ సంస్థ లక్ష కోట్ల పెట్టుబడితో వస్తోంది. ఇదే మా ప్రభుత్వంపై ఉన్న నమ్మకం అని అన్నారు.గత పాలకులు పీపీఏలు రద్దు చేసి, విద్యుత్ వాడకుండానే రూ.9 వేల కోట్లు చెల్లించారని, ఆ డబ్బు ఉండి ఉంటే ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీ తెచ్చినా దేశంలో మొదట అమలు చేసేది ఏపీనే అని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తి సహకారం అందిస్తుండగా, మంత్రి లోకేశ్ పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నారని ప్రశంసించారు.రాష్ట్రంలో సంపద సృష్టించి, అందులో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. "ఆలోచనలే ఇప్పుడు ఆస్తి. లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు కూడా ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా మారాలి," అని పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈల ద్వారానే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించామన్నారు. రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ సంస్థ లక్ష కోట్ల పెట్టుబడితో రిఫైనరీ ఏర్పాటు చేస్తోందని, పోర్టులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్‌గా మారుస్తామని తెలిపారు. 15 శాతం వృద్ధి రేటు సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిశ్రమలు, సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. "2026 నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తాం. కనిగిరి ఇకపై కనకపట్నం అవుతుంది. కరవు పీడిత ప్రాంతాలైన కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలకు గోదావరి జలాలను కూడా తీసుకొస్తాం. 2019లో మేం అధికారంలోకి రాకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది," అని అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఇలాంటి కష్టాలు రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa