ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.25 వేలు కడితే,,,18 ఏళ్లు దాటిన మహిళలకు ఇల్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:08 PM

రాష్ట్రంలో పేదలు అందరికీ సొంత ఇల్లు ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనను రాష్ట్రంలో అమలు చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలతో పాటుగా, పట్టణాలలో ఉండే వారికీ ఇళ్లు మంజూరు చేస్తున్నారు. అలాగే వారికి ఆర్థిక సాయం అందిస్తూ సొంతింటి కలను సాకారం చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కడప వాసులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పీఎంఏవై(అర్బన్‌) ఎన్టీఆర్‌ నగర్‌ పేదలందరికీ ఇళ్లు పథకం కింద టిడ్కో ఇళ్లను కేటాయించనుంది. టిడ్కో ద్వారా వివిధ విభాగాల్లో నిర్మించిన జీప్లస్‌ 3 ఇళ్లను అర్హులకు కేటాయించనున్నారు. ఈ విషయాన్ని కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ మనోజ్‌రెడ్డి వెల్లడించారు.


టిడ్కో ఫేజ్‌-1 కింద శ్రీ లక్ష్మీనగర్, ఫేజ్‌ 2 కింద చలమారెడ్డిపల్లిలో ఇళ్లు నిర్మించారు. 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు,430 చదరపు అడుగుల్లో వీటిని నిర్మించారు. వీటిని ఇప్పుడు అర్హులకు కేటాయించనున్నారు . అయితే 300 చదరపు అడుగులలో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించనుంది. 365 చదరపు అడుగుల ఇళ్ల కోసం లబ్ధిదారులు రూ. 7.55 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.1.5 లక్షలు అందిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 2.65 లక్షలు చెల్లిస్తుంది. మిగతా రూ. 3.15 లక్షలను బ్యాంకు రుణం రూపంలో అందిస్తారు. ఇల్లు పొందిన లబ్ధిదారులు రూ. 25 వేలు కట్టాల్సి ఉంటుంది.


మరోవైపు 430 చదరపు అడుగులలో నిర్మించిన ఇంటి ధరను రూ. 8.55 లక్షలుగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.90 లక్షలు అందిస్తుంది. 3.65 లక్షల రూపాయలను బ్యాంకు రుణంగా అందిస్తారు. లబ్ధిదారులు రూ. 50 వేలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ లబ్ధిదారులు బ్యాంక్ రుణం వద్దనుకుంటే సొంతంగా చెల్లించవచ్చు.


అయితే ఈ టిడ్కో ఇళ్లు పొందేందుకు ప్రభుత్వం కొన్ని అర్హతలు నిర్దేశించింది. మహిళలకే ఈ ఇళ్లు కేటాయిస్తారు. అలాగే వారి వయసు18 సంవత్సరాలు పైబడి ఉండాలి. కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వారై ఉండాలి. సొంత ఇల్లు, భూమి, ఇంటి పట్టా ఉన్నవారు అనర్హులు. అలాగే వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలలోపు ఉండాలి. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రం ద్వారా ఏవైనా గృహ నిర్మాణ సాయం పొంది ఉంటే పథకానికి అనర్హులు అవుతారు. కరెంట్ వినియోగం కూడా నెలకు 300 యూనిట్లు తక్కువ ఉండాలి. అర్హతలు, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 25వ తేదీలోపు కడప మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక విభాగంలో దరఖాస్తులు అందించాలని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa