ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్‌ను భయపెడుతున్న ఎగ్జిట్ పోల్స్..అవి ఎంత వరకు నిజం

national |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:22 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగియడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై పడింది. అయితే బిహార్‌లో గత రెండు ఎన్నికల (2020, 2015)లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. అసలు ఫలితాలకు ఎంత భిన్నంగా ఉన్నాయో గమనిస్తే.. తాజాగా వెల్లడి కానున్న అంచనాల పట్ల అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని అర్థం అవుతోంది. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌కు పట్టం కట్టి.. సగటున 125 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ తుది ఫలితాల్లో మాత్రం 125 సీట్లతో ఎన్డీఏ విజయం సాధించింది.


అంతకుముందు 2015లోనూ మహాఘట్‌బంధన్‌కు గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా.. ఏకంగా 178 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల గత చరిత్ర చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా ఫైనల్ రిజల్స్ట్‌ను అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఈ ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను పూర్తిగా కొట్టి పారేయలేమని చెబుతున్నారు.


2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు అని.. తుది ఫలితాల్లో తేలింది. దాదాపు 11 సర్వేల సగటు ఫలితం ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌కు 125 సీట్లు కట్టబెట్టాయి. మెజారిటీ మార్కు 122 సీట్లు కాగా.. అంతకంటే ఎక్కువే వస్తాయని అంచనా వేశాయి. అయితే ఎన్డీఏకు కేవలం 108 సీట్లు మాత్రమే వస్తాయని భావించారు. కానీ తుది ఫలితాలు మాత్రం పూర్తిగా విరుద్ధం అని తేల్చాయి. ఎన్డీఏ కూటమి 125 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకోగా.. మహాఘట్‌బంధన్ కేవలం 110 సీట్లకే పరిమితమైంది. ఇక న్యూస్ 18-టుడేస్ చాణక్య అనే సంస్థ అయితే మహాఘట్‌బంధన్‌కు ఏకంగా 180 సీట్లు.. ఎన్డీఏకు కేవలం 55 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేయగా.. అది పూర్తిగా బెడిసికొట్టింది.


2015లో ఊహించని ఘన విజయం


2015 బిహార్ శాసనసభ ఎన్నికల్లో.. జేడీయూ అధినేత నితీష్ కుమార్ (జేడీయూ), లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాఘట్‌బంధన్‌గా ఏర్పడి పోటీ చేశాయి. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పోటీ చేసింది. దాదాపు 6 ఎగ్జిట్ పోల్స్ సగటున మహాఘట్‌బంధన్‌కు 123 సీట్లు.. ఎన్డీఏకు 114 సీట్లు వస్తాయని అంచనా వేసి.. రెండు కూటముల మధ్య గట్టి పోటీ ఉంటుందని ఊహించాయి.


కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. మహాకూటమి ఏకంగా 178 సీట్లు సాధించి రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేవలం 58 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ మహాఘట్‌బంధన్ కూటమి వాస్తవ సీట్ల సంఖ్యను దాదాపు 55 సీట్లు తక్కువగా అంచనా వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విశ్వసించడంపై ఒక గందరగోళం నెలకొంది.


2015, 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మిశ్రమ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ అంచనాలను రాజకీయ విశ్లేషకులు, పార్టీలు అత్యంత అప్రమత్తతతో పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. తుది తీర్పు కోసం ఓట్ల లెక్కింపు రోజు వరకు వేచి చూడక తప్పదని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa