ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్‌‌ ఎన్నికల్లో మైథిలీ ఠాకూర్ విజయం.., ముస్లిం నియోజకవర్గంలో బీజేపీ గెలుపు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 08:12 PM

సంగీత ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 25 ఏళ్ల యువ గాయని మైథిలీ ఠాకూర్ .. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. దర్భంగాలోని కీలకమైన అలీనగర్ నియోజకవర్గంలో.. ఆర్జేడీ అభ్యర్థిపై 8,544 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచి.. బిహార్ అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు బీజేపీ అడుగుపెట్టని అలీనగర్ నియోజకవర్గంలో గెలిచి.. సరికొత్త చరిత్రను లిఖించారు. సాంస్కృతిక పునరుజ్జీవం, మహిళా విద్య, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికల్లో ఆమె ప్రచారం సాగించారు.


సంగీతం నుంచి రాజకీయాల్లోకి..!


చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మైథిలీ ఠాకూర్.. ఆపై రైజింగ్ స్టార్ వంటి రియాలిటీ షోల ద్వారా నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైథిలీ ఠాకూర్.. తన సాంస్కృతిక వారసత్వాన్ని రాజకీయాలకు వారధిగా మలచుకున్నారు. మైథిలీ ఠాకూర్, ఆమె సోదరులు రిషవ్, అయచి కలిసి చేసిన జానపద గీతాలు, రామచరితమానస్ గానం టీవీలు, సోషల్ మీడియాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ఈ సాంస్కృతిక మూలాలే ఆమెకు రాజకీయాల్లో బలమైన పునాదిగా మారాయి.


2000వ సంవత్సరం జూలై 25వ తేదీన జన్మించిన మైథిలీ ఠాకూర్.. 25 ఏళ్ల వయసులోనే బిహార్ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గతంలో ఈ ఘనత సాధించిన తేజస్వీ యాదవ్ (26 ఏళ్లు), తౌసీఫ్ ఆలం (26 ఏళ్లు) రికార్డులను మైథిలీ ఠాకూర్ అధిగమించనున్నారు. సాధారణంగా ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న అలీనగర్ నియోజకవర్గం సంప్రదాయంగా ఆర్జేడీకి కంచుకోటగా ఉండగా.. ఇలాంటి స్థానంలో బీజేపీ తొలిసారిగా గెలుపొందడం అనేది ఆ పార్టీ వ్యూహాత్మక విజయంగా మారింది. మిథిలాంచల్ ప్రాంతంలో సరికొత్త అధ్యాయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


మైథిలీ ఠాకూర్ తన ప్రచారంలో కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు. ఆమె సోదరులు ప్రదర్శనలు ఇవ్వగా.. మేనమామలు నంద్ కిషోర్ ఝా, సుమిత్ ఝా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఇది ఆమె సాంస్కృతిక వారసత్వాన్ని, కుటుంబ విలువలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు. మైథిలీ ఠాకూర్ తన రాజకీయ ప్రణాళికను సాంస్కృతిక పునరుజ్జీవం, సామాజిక సంస్కరణల మిశ్రమంగా ప్రకటించారు. పాఠశాలల్లో మిథిలా ఠాకూర్ పెయింటింగ్‌ను అదనపు పాఠ్యేతర అంశంగా ప్రవేశపెట్టడం.. అలాగే అలీనగర్ పేరును 'సీతానగర్'గా మార్చాలనే ప్రతిపాదన ఆమె ఎన్నికల హామీల్లో ముఖ్యంగా వినిపించింది.


విద్యారంగంపై, ముఖ్యంగా బాలికల విద్య, స్థానిక యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాలపై ఆమె దృష్టి సారించారు. 2019లో ఎన్నికల కమిషన్ ద్వారా మధుబని జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన మైథిలీ ఠాకూర్.. ఇప్పుడు అధికారికంగా రాజకీయ వేదికపైకి అడుగుపెట్టారు. 51 ఏళ్ల సగటు వయసున్న బిహర్ అసెంబ్లీలో.. 25 ఏళ్ల యువతి అడుగు పెట్టడం.. బిహార్ రాజకీయాల్లో యువతకు ఆదర్శనంగా నిలవడమే కాకుండా.. కొత్త శకానికి నాంది పలికినట్లయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa