దాదాపు రెండు నెలల క్రితం తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచారంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది చనిపోయారు. ఈ ఘటన తర్వాత నిలిచిపోయిన ఆయన రాజకీయ ప్రచారం.. తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాంచీపురం జిల్లాలో ఓ ఇండోర్ సదస్సు ఏర్పాటు చేశారు. ప్రైవేటు కాలేజీ ప్రాంగణంలో 1500 మందికే క్యూఆర్‌కోడ్ పాస్‌లు ఇచ్చి అనుమతించారు. ఎవరూ లోపలికి రాకుండా పకడ్భందీగా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్.. అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
డీఎంకే పార్టీ ప్రజలను విడదీసేలా రాజకీయాలు చేస్తోందని టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ ఆరోపణలు గుప్పించారు. డీఎంకేది దోపిడీ భావజాలమని ధ్వజమెత్తారు. అధికార పార్టీ వారసత్వ రాజకీయాలకు, ర్యాడికల్స్‌కు నిలయమని.. కానీ టీవీకే పార్టీ పాలసీలను సమానత్వం కోసం తీసుకువస్తున్నామన్నారు. అంతేకాకుండా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విజయ్ మండిపడ్డారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్‌ను వ్యతిరేకించారు. విజయ్ అటు డీఎంకే ఇటు బీజేపీపై విమర్శలు చేయడంతో తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది.
సుప్రీం కోర్టులో పిటిషన్..
ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో టీవీకే పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఐఆర్‌పై ఇప్పటికే అధికార డీఎంకే పార్టీ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. టీవీకే వేసిన పిటిషన్ నవంబర్ 24న విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సరిచేయడానికి, దొంగ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ ప్రక్రియ చేట్టింది. అక్కడ విజయవంతమైందని భావించి.. ఈ ప్రక్రియను దేశమంతా చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా, బీహార్‌లో ఎస్ఐఆర్ ద్వారా 68.66 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించడం గమనార్హం.
తమిళనాడు అధికార డీఎంకే కూడా ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తోంది. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఎస్ఐఆర్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బెంగాల్‌లో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు కేంద్రానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అర్హత ఉన్న వారి ఒక్క ఓటు తొలగించినా.. బీజేపీ అంతు చూస్తామన్నారు. కాగా, తమిళనాడు, బెంగాల్ సహా.. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవల ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా 321 జిల్లాలు, 1843 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రివిజన్ చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa