చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, వారి బతుకులు ఆగమ్యగోచరంగా మారాయని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రికార్డు స్థాయిలో పంటల ధరలు పతనమైనా ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడటం లేదని, ఇది చంద్రబాబు దుర్మార్గ పాలనకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తమ పంటలను తామే ట్రాక్టర్లతో దున్నేసుకునే దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు జగన్ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.చంద్రబాబు గారూ, మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద చొక్కా కూడా లేకుండా చేసి, ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు. రైతుల కష్టాలు, కన్నీళ్లు కనిపించకుండా చేసేందుకే ‘రైతన్నా మీకోసం పేరుతో డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. గత 18 నెలల కాలంలో మీరు రైతుల కోసం ఎక్కడ, ఎప్పుడు నిలబడ్డారో చెప్పాలి ని జగన్ నిలదీశారు.ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందంటూ జగన్ తీవ్రంగా స్పందించారు. మీరు తిరగడానికి మూడు విమానాలు, ఆరు హెలికాప్టర్లు, మీ విదేశీ పర్యటనలు, రాజకీయ కక్ష సాధింపు కేసుల కోసం లాయర్లకు, మీ పబ్లిసిటీ పిచ్చికి, మీకు డప్పు కొట్టే ఎల్లో మీడియాకు కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు గానీ, రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రావడం లేదు అని ఆయన ఆరోపించారు. పది వేల మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పలు చెప్పుకోవడం కాదని, పది మంది కలెక్టర్లకు ఫోన్ చేసి ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని ఎందుకు ఆదేశించలేకపోయారని ప్రశ్నించారు.ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తితో పాటు గతంలో కందులు, మినుములు, మిర్చి, పొగాకు, ఉల్లి, మామిడి వంటి పంటల ధరలు దారుణంగా పడిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని జగన్ విమర్శించారు. ఈ 18 నెలల్లో 16 సార్లు ప్రకృతి విపత్తులు వస్తే ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా రైతుల పక్షాన మేము పోరాడితే మాపై ఎదురుదాడి చేస్తూ, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మిర్చి, మామిడి రైతుల విషయంలో చేసిన హడావుడి ప్రకటనలు ఆచరణలో ఏమయ్యాయి అని ధ్వజమెత్తారు.తమ ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసాలను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని జగన్ ఆరోపించారు.ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు ఎన్నికల్లో 'అన్నదాతా సుఖీభవ' కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, రెండేళ్లకు ఇచ్చింది కేవలం రూ.10 వేలు మాత్రo. ఆర్బీకేలు, ఇ-క్రాప్, పొలం వద్దే పంట కొనుగోలు వంటి వ్యవస్థలన్నీ నాశనం చేశారు. రైతులు ఎరువుల కోసం బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించే దుస్థితికి తెచ్చారు అని జగన్ విమర్శించారు.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ మోసాలను, వంచనను, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, చంద్రబాబు కాలర్‌తో పాటు ఆయన పార్టీ నేతల కాలర్‌ను పట్టుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని జగన్ తీవ్రంగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa