జాతీయ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం నమోదైన సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 351కి చేరడం ద్వారా నగరమంతా ‘తీవ్ర’ (Severe) వర్గంలోకి వచ్చేసింది. ఇది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే స్థాయిగా పరిగణించబడుతుంది. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్న వారు ఇంటి బయటకు రాకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీలోని బురారీ, ఆనంద్ విహార్, జహంగీర్‌పురి, ఐటీఓ, చాందినీ చౌక్ వంటి ప్రధాన ప్రాంతాల్లో AQI 400కి దాటేసింది. కొన్ని చోట్ల 420–450 మధ్యలో కూడా రికార్డైంది. బుధవారం సాయంత్రం 327 వద్ద ఉన్న సూచీ రాత్రిపూట మరింత పెరిగి ఉదయానికి 351కి చేరింది. తక్కువ గాలులు, ఉష్ణోగ్రత తగ్గడం, పొగమంచు వ్యాప్తి వల్ల కాలుష్య కణాలు చెదిరిపోకుండా ఒక్క చోటే చేరి ఈ పరిస్థితి తలెత్తింది.
అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే… వరుసగా 21వ రోజు కూడా ఢిల్లీ AQI 300 పైనే నమోదవుతోంది. గత కొన్నేళ్లలో ఇంత ఎక్కువ రోజుల పాటు నిరంతరం ‘తీవ్ర’ స్థాయి కాలుష్యం ఉండటం ఇదే తొలిసారి. ఈ దీర్ఘకాల కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం గ్రాప్-4 నిబంధనలను అమలు చేస్తున్నా, ట్రక్కుల ఎంట్రీ ఆంక్షలు, నిర్మాణ కార్యకలాపాల నిషేధం, ఆన్‌లైన్ తరగతులు వంటి చర్యలు ఇప్పటి వరకు పెద్దగా ఫలితం ఇవ్వలేదు. రైతులు పంట వ్యర్థాలు తగలబెట్టడం, వాహన కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే పొగలు కలిసి ఢిల్లీని మళ్లీ ‘గ్యాస్ ఛాంబర్’గా మార్చాయి. ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగుతుందనేది ఇప్పుడు అందరిలోనూ పెద్ద ప్రశ్నగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa