చైనాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన షాంఘైలో భారతదేశం తన కొత్త అత్యాధునిక కాన్సులేట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించింది. గత 32 ఏళ్లలో చైనాలోని ఈ వ్యాపార కేంద్రంలో భారత్ కాన్సులేట్‌ను తరలించడం ఇదే తొలిసారి. చాంగ్నింగ్ జిల్లాలోని ప్రముఖ డాన్వింగ్ సెంటర్లో విస్తరించిన ఈ కొత్త భవనం 1,436.63 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది పాత భవనంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. ఈ అత్యాధునిక భవనాన్ని చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ లాంఛనంగా ప్రారంభించారు. అయితే కాన్సులేట్ కార్యకలాపాలు డిసెంబర్ 8వ తేదీ (సోమవారం) నుంచి ఈ కొత్త ప్రాంగణంలో పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతున్నాయి.
భారత్-చైనా దౌత్య సంబంధాలు ప్రారంభం అయ్యి ఆదివారంతో 75 ఏళ్లు కాగా.. ఈ కొత్త భవనం ప్రారంభోత్సవం ప్రత్యేకత సంతరించుకుందని రాయబారి రావత్ తెలిపారు. షాంఘైతో భారత్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాలకు ఈ ప్రపంచ స్థాయి కాన్సులేట్ జనరల్ నిదర్శనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ మాట్లాడుతూ.. కొత్త భవనం ద్వారా భారతీయ పౌరులకు, చైనా భాగస్వాములకు మెరుగైన, నిరంతరాయ సేవలు అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
ఈ విస్తరణ వల్ల కాన్సులర్, వాణిజ్య, సాంస్కృతిక, పరిపాలనా విధులను ఒకే సురక్షితమైన, ఆధునిక అంతస్తులో నిర్వహించడానికి వీలవుతుందన్నారు. ఇది సేవల్లో సామర్థ్యాన్ని పెంచి, ప్రజా సేవలను మెరుగుపరుస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఈ కాన్సులేట్ భవనం హోంగ్‌కియావో–గూబీ విదేశీ వ్యాపార కారిడార్‌లో ఉండటం వ్యూహాత్మకంగా చాలా ప్రయోజనకరమని మాథుర్ తెలిపారు. భారత్-షాంఘైల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమైన సమయంలోనే ఈ ప్రారంభోత్సవం జరిగిందని అన్నారు.
ఇది వాణిజ్యం, ప్రయాణం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాథుర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా "మనం ఈ అందమైన కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నప్పుడు.. ఈ భవనాన్ని కేవలం కార్యాలయంలా కాకుండా భారత్, తూర్పు చైనా ప్రాంతం మధ్య స్నేహం, వాణిజ్యం, సంస్కృతి, ప్రజల సంబంధాలకు శక్తివంతమైన కేంద్రంగా మారుద్దాం" అని మాథుర్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ ప్రారంభోత్సవానికి దౌత్యవేత్తలు, షాంఘై మునిసిపల్ ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ నగరాల నుంచి భారతీయ ప్రవాసులు సహా 400 మందికి పైగా అతిథులు హాజరు అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa