ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడుచుకుంటూ ఒక్క రోజులో దేశం మొత్తం చుట్టేయొచ్చు

international |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 11:20 PM

కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని.. అక్కడ ఉండే రకరకాల విశేషాలను తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఉద్యోగాలు వదిలేసి మరీ.. ట్రావెల్ వ్లాగర్లుగా మారిపోయి.. ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడి వింతలు, విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. లైక్స్, కామెంట్లు, షేర్లు, సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లు అంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారిపోతున్నారు. ఇలా నెలకు రూ.లక్షలు.. రూ.కోట్లు కూడా సంపాదిస్తున్నారు. ఇక మరికొందరు లీవులు దొరికితే.. ఈ వర్క్ ప్రెజర్ నుంచి తట్టుకునేందుకు.. ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. అయితే ఒకే రోజులో మొత్తం దేశమంతా చూసే చిన్న దేశాలు కూడా ఉన్నాయి.


ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు చాలానే ఉన్నాయి. మరీ ఒక్కరోజులోనే దేశం మొత్తం తిరిగేవి కూడా ఉన్నాయంటే నమ్మడం చాలా కష్టమే. కానీ 24 గంటల వ్యవధిలోనే దేశమంతా చూసే 6 దేశాల జాబితా ఇప్పుడు చూద్దాం. ఈ దేశాల పరిమాణం చూడడానికి చిన్నవే అయినా.. అవి పూర్తి ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.


వాటికన్ సిటీ


ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది కళ, చరిత్ర, ఆధ్యాత్మిక సంపదకు నిలయం. రోమ్ నగరంలో ఉన్న ఈ సిటీ స్టేట్ సెయింట్ పీటర్స్ బాసిలికా, సిస్టీన్ చాపెల్ వంటి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. అక్కడ ఉన్న ప్రతి వస్తువు ఒక కళాఖండంలా కనిపిస్తుంది. అందుకే ఒక్క రోజు పర్యటనకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఏప్రిల్ నుంచి జూన్.. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఈ వాటికన్ సిటీని చూసేందుకు సరైన సమయం. ఇక వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసిలికాను సందర్శించడంతోపాటు.. దాని డోమ్‌పైకి ఎక్కి అద్భుతమైన వ్యూను ఆస్వాదించవచ్చు. సిస్టీన్ చాపెల్‌లోని మైకెలాంజెలో కుడ్యచిత్రాలను చూడటం.. వాటికన్ మ్యూజియంలను సందర్శించవచ్చు.


మొనాకో


మొనాకో చిన్న దేశమైనా.. విలాసవంతమైన జీవనశైలి, క్యాసినోలు, అద్భుతమైన మధ్యధరా సముద్ర దృశ్యాలతో నిండి ఉంటుంది. మొనాకోలో నడవడం ఒక పోస్ట్‌కార్డ్‌లో నడుస్తున్న అనుభూతిని ఇస్తుంది. అక్కడి హార్బర్, స్టైలిష్ బోటిక్‌లు, ఉల్లాసభరితమైన వీధులు ప్రతి అడుగును మరపురాని క్షణాలుగా మారిపోతాయి. మార్చి నుంచి మే.. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఈ మొనాకో దేశాన్ని సందర్శించవచ్చు. మాంటే కార్లో క్యాసినో, దాని తోటల్లో వాకింగ్ బాగుంటుంది. ఓల్డ్ సిటీ, ప్రిన్స్ ప్యాలెస్‌ బాగా ఫేమస్. హార్బర్, అక్కడి తోటల సుందరమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.


లీచ్‌టెన్‌స్టెయిన్


స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్య దాగి ఉన్న లీచ్‌టెన్‌స్టెయిన్.. ఆల్పైన్ అందం, విచిత్రమైన గ్రామాలకు ప్రసిద్ధి చెందింది. ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక అనుభవాలను అందిస్తూ.. ఒక రోజు పర్యటనకు ఈ లీచ్‌టెన్‌స్టెయిన్ సరైన దేశం. అక్కడి కోటలు, పచ్చదనం ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలా ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్ వరకు పర్యటించేందుకు ఉత్తమ సమయం. వడూజ్ కాజిల్, లీచ్‌టెన్‌స్టెయిన్ రాజధాని, లీచ్‌టెన్‌స్టెయిన్ నేషనల్ మ్యూజియం స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటాయి. అద్భుతమైన పర్వత దృశ్యాలతో కూడిన హైకింగ్ ట్రైల్స్‌ను ఆస్వాదించవచ్చు.


శాన్ మారినో


ఇటలీలోని కొండపై ఉన్న శాన్ మారినో.. ప్రపంచంలోని పురాతన రిపబ్లిక్‌లలో ఒకటిగా నిలిచింది. దాని మధ్యయుగం నాటి వాస్తుశిల్పం, విస్తృతమైన దృశ్యాలు.. చరిత్ర, ఫోటోగ్రఫీ లవర్స్‌ ఒక కలలాంటివి. అక్కడి రాళ్లతో వేసిన వీధులు, పురాతన టవర్లు ఒక మాయాజాల ప్రపంచం అనుభూతిని కలిగిస్తాయి. శాన్ మారినో సందర్శనకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మంచి సమయం. శాన్ మారినో చారిత్రక కేంద్రం, దాని టవర్లలో తిరగొచ్చు. బాసిలికా డి శాన్ మారినోను తప్పకుండా సందర్శించాలి. ప్రత్యేకమైన సావనీర్లను కొనుగోలు చేసి స్థానిక వంటకాలను ఆస్వాదించవచ్చు.


అండోరా


ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య పిరెనీస్ పర్వతాల్లో ఉన్న అండోరా.. పర్వత దృశ్యాలు, మనోహరమైన గ్రామాలకు ప్రసిద్ధి చెందిన ఒక చిన్న రాజరిక దేశం. దీని రాజధాని.. అండోరా లా వెల్లా.. చరిత్ర, షాపింగ్, ప్రకృతి కలయికను అందిస్తూ నడవడానికి అనువుగా ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్ వరకు సందర్శించవచ్చు. అండోరాలోని చారిత్రక ఓల్డ్ సిటీ, కాసా డి లా వాల్‌ను తప్పక సందర్శించాలి. షాపింగ్, కేఫ్‌ల కోసం ఎవింగ్గుడా మెరిట్‌క్సెల్ వెంట నడవాలి. అద్భుతమైన వ్యూ కోసం మద్రియు పెరాఫిటా క్లారర్ లోయలో చిన్న హైకింగ్‌ చేయవచ్చు.


మాల్టా


మాల్టా రాజధాని నగరం వాలెట్టా.. ఒక చదరపు కిలోమీటరు కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చరిత్రలోకి ఎక్కింది. ప్రతి వీధి ఒక చరిత్రతో నిండి ఉంటుంది. గొప్ప బరోక్ వాస్తుశిల్పం, ఉల్లాసభరితమైన జంక్షన్లు, అద్భుతమైన సముద్ర దృశ్యాలు వాలెట్టాలో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి జూన్.. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు సందర్శించేందుకు ఉత్తమ సమయం. సెయింట్ జాన్స్ కో కేథడ్రల్‌ను సందర్శించి అందులో అద్భుతంగా అలంకరించబడిన భాగాలను ఆస్వాదించవచ్చు. పనోరమిక్ హార్బర్ వ్యూతో అప్పర్ బరాక్కా గార్డెన్స్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు. రిపబ్లిక్ స్ట్రీట్‌లో తిరుగుతూ స్థానిక కేఫ్‌లు, బోటిక్‌లను చూడొచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa