తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుని.. ఏకంగా 41 మంది దుర్మరణం చెందిన తర్వాత.. మరోసారి ఆయన భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారు. ఈనెల 18వ తేదీన ఈరోడ్ జిల్లాలో టీవీకే బహిరంగ సభకు.. ఎట్టకేలకు తమిళనాడు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఈ అనుమతిని 84 కండీషన్లతో మంజూరు చేశారు. షరతులతోపాటు రూ. 50,000 సెక్యూరిటీ బాండ్ సమర్పించాలని ఆదేశించారు. ఈరోడ్ పోలీసులు లా అండ్ ఆర్డర్ నిర్వహణ, జనాల సమూహాన్ని నియంత్రించడం, బహిరంగ సభ నిర్వహణ కోసం ఈ షరతులను విధించారు.
విజయమంగళం వద్ద హిందూ మత, ధార్మిక దేవాదాయ శాఖ (హెచ్‌ఆర్ అండ్ సీఈ కరూర్) నియంత్రణలో ఉన్న 16 ఎకరాల ప్రైవేట్ ఆలయ భూమిలో ఈనెల 18వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశాన్ని నిర్వహించడానికి టీవీకే పార్టీ తమిళనాడు పోలీసుల అనుమతి కోరింది. కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ 84 షరతులు విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఈరోడ్ ర్యాలీకి అనుమతిలో భాగంగా.. సభ నిర్వాహకులు రూ. 50 వేల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. బహిరంగ సభ పూర్తి అయిన తర్వాత వేదికను పూర్తిగా శుభ్రం చేసి.. అంతకుముందు ఎలా ఉందో ఆ స్థితిలో అప్పగించాలని కూడా షరతు విధించారు. మొదట్లో సభ నిర్వహణకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు హెచ్‌ఆర్ అండ్ సీఈ శాఖ నిరాకరించింది. దీంతో టీవీకే పార్టీ ప్రతినిధులు ఆలయ అధికారులను కలిసి మాట్లాడటంతో అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోడ్ ఎస్పీ ఏ సుజాత, పోలీస్ సిబ్బందితో కలిసి వేదికను పరిశీలించి సమావేశానికి అనుమతి మంజూరు చేశారు.
డిసెంబర్ 18న జరిగే భారీ బహిరంగ సభ కోసం ముందస్తు పనులు జరుగుతున్నాయని టీవీకే చీఫ్ కోఆర్డినేటర్ కేఏ సెంగుట్టయ్యన్ వెల్లడించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన విజయమంగళం టోల్‌గేట్ సమీపంలోని ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా.. తమిళనాడులో ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లభించకపోవడంతో.. ఈనెల 6వ తేదీన పుదుచ్చేరిలో ర్యాలీ నిర్వహించిన విజయ్.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్ జిల్లాలో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట జరిగి.. మొత్తం 41 మంది మరణించడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీంతో టీవీకే పార్టీపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ ఘటన తర్వాత తమిళనాడులో విజయ్ బహిరంగ సభలను నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa