ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాకేశ్ గంగ్వాల్, రాహుల్ భాటియాలు తొలిసారి హురున్ ఇండియా లిస్టులో చోటు దక్కించుకున్నారు. స్వయం కృషితో ఎదిగిన వ్యాపారవేత్తల లిస్టులో మూడో స్థానంలో నిలిచారు. వీరు స్థాపించిన ఇంటర్ గోల్బ్ ఏవియషన్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.2.2 లక్షల కోట్లుగా ఉన్నట్లు హురున్ నివేదిక లెక్కగట్టింది. ఇక జొమాటో మాతృ సంస్థ ఎటెర్నల్ సీఈఓ దీపిందర్ గోయల్ హురున్ ఇండియా జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన స్థాపించిన ఎటెర్నల్ కంపెనీ మార్కెట్ విలువ రూ.3.2 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది.
దీంతో డీ-మార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీని దీపిందర్ గోయల్ వెనక్కి నెట్టారు. ఇదే సమయంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ విలువ 13 శాతం పడిపోయి రూ.3 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈ మేరకు ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా టాప్ 200 బిజినెస్మెన్ లిస్టు 2025ని తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది 2025 సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ఈ లిస్టును తయారు చేసింది. ఇటీవల ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం పడింది. అయినా దేశీయ విమానయాన రంగంలో 65 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. దీంతో ఇండిగో అగ్రగామిగా ఉన్నట్లు హురున్ నివేదిక పేర్కొంది.
హురున్ ఇండియా జాబితాలో దీపిందర్ తొలిసారి అగ్ర స్థానం దక్కించుకున్నారు. ఆయన ప్రారంభించిన జొమాటో దేశవ్యాప్తంగా 800 నగరాల్లో డెలివరీ సేవలు అందిస్తున్నట్లు హురున్ ఇండియా నివేదిక పేర్కొంది. ఇక స్విగ్గీ సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి ఈ లిస్టులో ఐదో స్థానలో నిలిచారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5 శాతం వృద్ధి నమోదైంది.
పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ ఈ లిస్టులో 8వ స్థానంలో నిలిచారు. ఆయన కంపెనీ విలువ రూ.72,800 కోట్లుగా లెక్కించారు. గత ఏడాదితో పోలిస్తే 67 శాతం పెరిగింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన లెన్స్ కార్ట్ 60 శాతం వృద్ధితో రూ.67 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగి ఉంది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు పీయూష్ బన్సల్, అమిత్ చౌదరి, నేహా బన్సల్ ఈ జాబితాలో టాప్ 10లో నిలిచారు.
టాప్-10 లిస్ట్ ఇదే
దీపిందర్ గోయల్- ఎటెర్నల్
రాధాకృష్ణ దమానీ- డీమార్ట్
రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్- ఇండిగో
అభయ్ సోయి- మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్
శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి- స్విగ్గీ
దీప్ కర్లా, రాజేశ్ మాగౌ- మేక్ మై ట్రిప్
యాశిష్ దహియా, అలోక్ బన్సల్- పాలసీ బజార్
విజయ్ శేఖర్ శర్మ- పేటీఎం
ఫల్గుణి నాయర్, అద్వైత్ నాయర్- నైకా
పీయూష్ బన్సల్, అమిత్ చౌధరి, నేహా బన్సల్, సుమిత్ కపాహీ- లెన్స్కార్ట్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa