మొన్నటి వరకు మన దేశాన్ని భారీ వర్షాలు భయపెట్టాయి. కుండపోత వానలు, వరదలతో జన జీవనం అస్తవ్యస్తం అయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు కురిశాయి. చాలా చోట్ల క్లౌడ్ బరస్ట్ జరిగింది. వరదలతో రోడ్లు కొట్టుకుపోయాయి.. ఇళ్లు, పంటలు మునిగిపోయాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. ఈ ఏడాది వర్షాల వల్ల మన దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను చవి చూశారు. మన దగ్గర అంటే వర్షాలు, వరదలు చాలా సాధారణం. కానీ ఇప్పుడీ పరిస్థితులన్నీ ఎడారి దేశాల్లో కనిపిస్తున్నాయి. కుండపోత వానతో ఆ దేశాలు అల్లాడిపోతున్నాయి.
ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల.. అబుదాబీ, దుబాయ్‌తో పాటు నగరాల్లో జనజీవనం గందరగోళానికి గురైంది. కొన్ని గంటల పాటు ఎక్కడివారు అక్కడ ఆగిపోయారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. ఫలితంగా ప్రయాణాలు చేసేవారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో.. శుక్రవారం పలు విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. సెలవులకు సిద్ధమవుతోన్న వేళ కుండపోత వానలు కురుస్తుండటంతో.. స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సహాయక చర్యలు నిర్వహించడానికి రంగంలోకి దిగాయి.
ఇదిలా ఉంటే.. దుబాయ్, అబుదాబీ పట్టణాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో.. కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. నగరంలోని బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలు, పార్కులను తాత్కాలికంగా మూసి వేసింది.
భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ఇళ్లు దాటకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దని, అది ఏ నిమిషంలోనైనా ప్రమాదకరంగా మారవచ్చని షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ సూచించింది. దోహా, ఖతార్లలోనూ ఇటువంటి పరిస్థితే కనిపించింది.
ప్రస్తుతం యూఏఈలో కురుస్తోన్న వర్షాలతో 24 ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్ అయ్యింది అంటున్నారు ఇక్కడి అధికారులు. అలానే గతేడాది కూడా భారీ వరదలు దుబాయ్‌ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. తక్కువ వ్యవధిలో భారీ వర్షం కురిస్తే.. దానికి తగ్గట్టుగా వాన నీరు వెళ్లిపోయేలా.. డ్రైనేజీ వ్యవస్థ, అండర్‌పాస్ నిర్మాణాలు లేవు. ఈ పరిస్థితే.. ఆకస్మిక వరదలకు కారణంగా తెలుస్తోంది. వరదల నేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక మున్సిపల్ సిబ్బంది.. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అలానే ట్రావెల్ అడ్వైజరీలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa