ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాలు .. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. పర్వతం, కొండకు సరైన నిర్వచనం ఏంటి అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త నిర్వచనంపై పర్యావరణ వేత్తలు, రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఒక్క నిర్వచనంతో ఆరావళి పర్వతాల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరావళి పర్వతాలను తొలగించి.. అక్కడ మైనింగ్ జోన్లుగా మార్చాలని.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ కొత్త నిబంధనల వల్ల రాజస్థాన్, హర్యానాలో ఉన్న మెజారిటీ పర్వత శ్రేణులు తమ రక్షణ పరిధిని కోల్పోయి, గనులు, రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్తాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో #SaveAravalli హ్యాష్‌ట్యాగ్ వైరల్ కావడంతో ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆరావళి పర్వతాల వివాదం తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త నిర్వచనంతోపాటు.. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణం అయింది. ఏదైనా పర్వతం, కొండకు శాస్త్రీయ నిర్వచనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శాస్త్రీయ నిర్వచనం తీవ్ర దుమారానికి కారణం అయింది. భూమి ఉపరితలం నుంచి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉన్న వాటినే కొండలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
అంటే 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ఆరావళి శ్రేణులను ఇక నుంచి కొండలుగా గుర్తించరు. దీని వల్ల 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న వాటికి పర్యావరణ చట్టాల నుంచి రక్షణ లభించదు. అయితే ఆరావళి పర్వతాల్లో దాదాపు 90 శాతం కొండలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అంటే 90 శాతం ఆరావళి ప్రాంతం మైనింగ్ జోన్లుగా మారిపోయే ప్రమాదం ఉందని తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.
ఆరావళి పర్వతాలు ఎందుకు ముఖ్యం?
ఆరావళి పర్వతాలు అంటే కేవలం రాళ్లు, రప్పలు మాత్రమే కాదు.. ఇవి ఉత్తర భారతదేశానికి జీవనాధారంగా కొన్ని శతాబ్దాలుగా ఉన్నాయి. అంతేకాకుండా ఎడారీకరణకు అడ్డుకట్ట వేస్తాయి. థార్ ఎడారి తూర్పు వైపు విస్తరించకుండా ఈ ఆరావళి పర్వతాలు సహజమైన గోడలా అడ్డుకుంటున్నాయి. ఈ ఆరావళి పర్వతాలు.. భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలుష్యాన్ని కూడా నియంత్రణలో ఉంచుతాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో విషపూరితమైన గాలిని వడపోసి.. వాతావరణాన్ని సమతుల్యం చేస్తాయి.
నెట్టింట హోరెత్తుతున్న #SaveAravalli ఉద్యమం
కొండ, పర్వతం నిర్వచనం పేరుతో ఆరావళి పర్వతాలను నాశనం చేయవద్దని నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గళం విప్పుతున్నారు. #SaveAravalli హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి రూపొందించిన.. వీడియోలు, ఎమోషనల్ పోస్టుల ద్వారా నెటిజన్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి పర్వతాలు అంతరిస్తే పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలు నివాస యోగ్యం కాకుండా పోతాయని పర్యావరణ వేత్త చంద్రమౌళి బసు హెచ్చరించారు.
రాజకీయంగా తీవ్ర దుమారం
మరోవైపు.. ఈ ఆరావళి పర్వతాల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్.. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వంటి వారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే పర్యావరణాన్ని బలిపెడుతోందని ఆరోపించారు.
కేంద్రం వివరణ
ఆరావళి పర్వతాలపై వస్తున్న ఈ ఆరోపణలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కొట్టిపారేశారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకే కొండ నిర్వచనంలో స్పష్టతను తెస్తున్నామని పేర్కొన్నారు. ఆరావళి పర్వతాల ప్రాంతంలో కేవలం 0.19 శాతం భూమిలో మాత్రమే మైనింగ్‌కు అవకాశం ఉంటుందని.. పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్తుకు పొంచి ఉన్న ప్రమాదం
అయితే కొండ, పర్వతాలకు నిర్వచనాల కంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఎత్తుతో సంబంధం లేకుండా మొత్తం ఆరావళి పర్వతాల పర్యావరణ వ్యవస్థను సంరక్షించకపోతే.. భవిష్యత్తులో తీవ్రమైన నీటి ఎద్దడి, విపరీతమైన కాలుష్యం ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం భవిష్యత్ తరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరావళి పర్వతాల విషయంలో ప్రభుత్వం సమతుల్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa