దేశీయ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి గండిపడనుంది. ఇన్నాళ్లూ ఇండిగో వంటి ఎయిర్‌లైన్స్ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉండేది. ఇకపై వారి ఆటలు సాగవు. దేశంలో కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అల్ హింద్ ఎయిర్ , ఫ్లైఎక్స్‌ప్రెస్, శంఖ్ ఎయిర్ సంస్థలు విమానాలు నడిపేందుకు ఆమోదం తెలిపింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలు కేంద్ర పౌర విమాయాన శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను అందుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన శంఖ్ ఎయిర్ ఇప్పటికే ఎన్వోసీ అందుకోగా.. 2026 నుంచి దీని సేవలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
దేశంలో విమానయాన రంగం విస్తరిస్తోంది. దేశీయ విమానయాన మార్కెట్లో భాగస్వామ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో కొత్త సంస్థలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం తొమ్మిది దేశీయ విమానయాన సంస్థలు మాత్రమే నడుస్తున్నాయి. అక్టోబర్‌లో ఫ్లై బిగ్ సంస్థ సేవలు నిలిపివేయడంతో ఈ సంఖ్య తగ్గింది. కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ విమానయాన రంగంలోకి ప్రవేశిస్తోంది. ఫ్లైఎక్స్‌ప్రెస్ కూడా మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న సంస్థలలో ఒకటి. ఇప్పటికే అనుమతి పొందినశంఖ్ ఎయిర్ వచ్చే ఏడాది వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది.
దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ (ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్) కలిసి 90 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇండిగో ఒక్కటే 65 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్త సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఇటీవల ఇండిగో సంక్షోభం ఈ రంగంలో ఒకే సంస్థపై ఆధారపడటం వల్ల కలిగే నష్టాలను తెలియజేసింది. ఈ నేపథ్యంలో కొత్త విమానయాన సంస్థల రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ అనుమతుల గురించి మంగళవారం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ బృందాలతో మంత్రిత్వ శాఖ సమావేశమైందని, శంఖ్ ఎయిర్ ఇప్పటికే అనుమతి పొందిందని, మిగిలిన రెండు సంస్థలకు ఈ వారం NOCలు అందాయని ఆయన తెలిపారు.
దేశీయ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ఎక్కువ సంస్థలను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ విధానమని నాయుడు పునరుద్ఘాటించారు. ప్రాంతీయ అనుసంధానతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఉడాన్ వంటి ప్రభుత్వ పథకాలు చిన్న విమానయాన సంస్థలకు సహాయపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఉడాన్ పథకం కింద, స్టార్ ఎయిర్, ఇండియా వన్ ఎయిర్, ఫ్లై91 వంటి విమానయాన సంస్థలు సేవలు తక్కువ ఉన్న మార్గాలలో తమ సేవలను విస్తరించాయి. చిన్న నగరాలను జాతీయ విమానయాన నెట్‌వర్క్‌తో అనుసంధానించడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. ఈ విభాగంలో ఇంకా వృద్ధికి అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజా డేటా ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ప్రభుత్వ రంగ సంస్థ అలయన్స్ ఎయిర్, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, స్టార్ ఎయిర్, ఫ్లై91, ఇండియా వన్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ఉన్నాయి. గతంలో జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ వంటి విమానయాన సంస్థలు అప్పులు, నిర్వహణ సవాళ్లతో మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త విమానయాన సంస్థల రాక ఈ రంగం అస్థిరతను కూడా తెలియజేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa