ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలో వీధి కుక్కలు లేని తొలి దేశంగా నెదర్లాండ్స్

international |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 10:00 PM

నెదర్లాండ్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. సముద్రం నుంచి భూమిని తిరిగి సృష్టించడమే కాకుండా.. ఇప్పుడు వీధి కుక్కలు లేని తొలి దేశంగా రికార్డు సృష్టించింది. మందుగుండు లేదా కుక్కలను చంపే పద్ధతులను వాడకుండా.. కేవలం క్రమశిక్షణ, జంతు ప్రేమే ఆయుధాలుగా ఈ ఘనతను సాధించింది. ఒకప్పుడు నెదర్లాండ్స్ వీధుల్లోనూ కుక్కల బెడద ఎక్కువగానే ఉండేది. కానీ అక్కడి డచ్ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో దశాబ్దాల పాటు శ్రమించి ఈ సమస్యను మూలాల నుంచి పరిష్కరించింది. దీని వెనుక ప్రధానంగా CNVR అనే పద్ధతి ఉంది.


డచ్ విజయం వెనుక ఉన్న 4 సూత్రాలు


1. CNVR పద్ధతి 


నెదర్లాండ్స్ ప్రభుత్వమే వీధి కుక్కలను పట్టుకుని (Collect).. వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసి (Neuter).. రేబిస్ వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేసి (Vaccinate), తిరిగి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టడం (Return). దీనివల్ల కొత్తగా కుక్కల సంతతి పెరగకుండా నియంత్రించగలిగారు.


2. పెంపుడు కుక్కలపై భారీ పన్నులు


బ్రీడర్ల వద్ద లేదా పెట్ షాపుల్లో కుక్కలను కొనుగోలు చేసే వారిపై నెదర్లాండ్స్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించింది. దీనివల్ల ప్రజలు కుక్కలను కొనడం కంటే, షెల్టర్లలో ఉన్న కుక్కలను దత్తత తీసుకోవడానికి మొగ్గు చూపారు.


3. కఠినమైన చట్టాలు-జైలు శిక్ష


జంతువులను హింసించినా లేదా రోడ్ల మీద వదిలేసినా నెదర్లాండ్స్‌లో కఠిన శిక్షలు విధించడం ప్రారంభించారు. అలా చేసిన నిందితులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు వేల యూరోల జరిమానాను విధించారు. ఇందు కోసం ప్రత్యేకంగా యానిమల్ పోలీస్ యూనిట్లను ఏర్పాటు చేశారు.


4. సాంస్కృతిక మార్పు


19వ శతాబ్దం నుంచే నెదర్లాండ్స్ ప్రజల్లో జంతువుల పట్ల స్పృహ పెరిగింది. జంతువుల హక్కుల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ కూడా ఉండటం డచ్ సమాజంలో జంతువులకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేస్తుంది.


భారతదేశానికి ఇది ఎందుకు ముఖ్యం?


భారతదేశంలో లక్షలాది వీధి కుక్కలు ఉన్నాయి. రేబిస్ భయం, కుక్కల కాట్లు, జంతు ప్రేమికులు-స్థానికుల మధ్య వివాదాలు నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. నెదర్లాండ్స్ అనుసరించిన ఈ విధానం భారత్‌కు ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సంరక్షణను కేవలం జంతు ప్రేమికులకు వదిలేయకుండా.. ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. 'కొనుగోలు వద్దు - దత్తత ముద్దు' అనే నినాదం బలపడాలి. కుక్కలను కొట్టడం లేదా విషం పెట్టి చంపడం కాకుండా.. పక్కాగా స్టెరిలైజేషన్ పద్ధతులను అమలు చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa