అప్పులు తీసుకుంటే సకాలంలో చెల్లించాలి. లేకపోతే వడ్డీలు, వాటి మీద చక్రవడ్డీలు, ఫైన్లు ఇలా తడిసిమోపెడు అవుతూ ఉంటాయి. అప్పు తీర్చలేని పరిస్థితి ఉంటే.. అసలు రుణాలు తీసుకోకపోవడమే బెటర్ అంటూ ఎంతో మంది ఆర్థిక నిపుణులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ చాలా మంది అదే ఊబిలోకి చిక్కుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా ఎంతో మంది అప్పులు తీసుకుని.. వాటిని కట్టలేక తిప్పలు పడుతూ ఉన్న ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డవారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా సింగపూర్‌కు చెందిన ఒక వ్యక్తి రూ.1.75 కోట్ల అప్పు తీసుకుంటే.. వడ్డీ, పెనాల్టీల కారణంగా అది ఏకంగా రూ.147 కోట్లకు చేరిన విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారాన్ని పరిశీలించిన సింగపూర్ హైకోర్టు జడ్జి ఫిలిప్ జేయరత్నం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ ఘటన మనస్సాక్షిని కలిచివేసేది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగపూర్‌లోని ఒక లైసెన్స్ పొందిన వడ్డీ వ్యాపారి వద్ద ఆ వ్యక్తి.. అప్పు తీసుకోగా.. అది అతడి జీవితాన్నే తలకిందులు చేసింది. 2010లో ఆ వ్యక్తి తన అవసరాల కోసం సుమారు రూ.1.75 కోట్ల అప్పు తీసుకున్నాడు. అందుకు నెలకు 4 శాతం (ఏడాదికి 48 శాతం) చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు.
వాయిదా చెల్లించడం ఆలస్యమైతే నెలకు 8 శాతం అదనపు వడ్డీ, ఆలస్యంగా చెల్లిస్తే.. ప్రతీ నెలా రూ.1.75 లక్షలు ఫైన్‌గా నిర్ణయించారు. దీంతో అది కేవలం 4 ఏళ్లలోనే అంటే 2014 నాటికి ఆ అప్పు రూ.21 కోట్లకు చేరింది. 2021 నాటికి అది ఏకంగా రూ.147 కోట్లకు ఎగబాకింది. అతడు తీసుకున్న అప్పు కొండలా పేరుకుపోయి అప్పు తీర్చలేకపోయిన తరుణంలో తన సొంత ఇంటిని ఆ వడ్డీ వ్యాపారికి విక్రయించాల్సి వచ్చింది. ఆ ఇంటిని రూ.14 కోట్లకుఆ వడ్డీ వ్యాపారి సంస్థ డైరెక్టరుకే అమ్మేసినప్పటికీ అతని అప్పు తీరలేదు. ప్రస్తుతం అతను అదే ఇంట్లో తన కుటుంబంతో కలిసి నెలకు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు.
కోర్టు ఏమంది?
అద్దె చెల్లించలేదనే కారణంతో డైరెక్టర్ కోర్టుకు వెళ్లగా.. ఆ అప్పు పెరిగిన తీరు చూసి సింగపూర్ హైకోర్టు జడ్జి ఆశ్చర్యపోయారు. అంత తక్కువ అప్పు అంత భారీ స్థాయికి ఎలా చేరిందనే దానిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. వడ్డీ వ్యాపారి కావాలనే మోసం చేశాడా లేదా చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. రూ.1.75 కోట్ల అప్పు కోట్లలోకి చేరడం అన్యాయమని.. ఇది సమాజ నియమాలకు విరుద్ధమని జడ్జి పేర్కొన్నారు.
సింగపూర్‌లో 2015 అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం లైసెన్స్ పొందిన వడ్డీ వ్యాపారులు నెలకు 4 శాతానికి మించి వడ్డీ వసూలు చేయకూడదు. లేట్ పేమెంట్ ఫీజు నెలకు రూ.4200కు మించకూడదు. కానీ ఈ వ్యక్తి అప్పు 2010లో తీసుకోవడం వల్ల పాత నిబంధనల లొసుగులను వడ్డీ వ్యాపారి అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa