బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ అగాధంలోకి వెళ్తోంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు పరాకాష్టకు చేరుకున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.
నర్సింగ్దీ జిల్లాకు చెందిన మణి చక్రవర్తి అనే కిరాణా వ్యాపారి సోమవారం రాత్రి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు దుకాణంలోకి చొరబడి.. పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. ఈక్రమంలోనే మణి చక్రవర్తి తీవ్ర గాయాల పాలుకాగా.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆపై విషయం గుర్తించిన స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల ముందే యశోర్ జిల్లాలో ఒక ఐస్ ఫ్యాక్టరీ యజమాని, స్థానిక పత్రిక సంపాదకుడు అయిన 45 ఏళ్ల రాణా ప్రతాప్ కూడా దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగులు ఆయన్ను ఫ్యాక్టరీ బయటకు పిలిచి, గొంతు కోసి, తలలో మూడు సార్లు కాల్చి చంపి పరారు అయ్యారు.
కేవలం హత్యలే కాదు మైనారిటీ మహిళలపై వేధింపులు కూడా భయాందోళనలు కలిగిస్తున్నాయి. గత శనివారం జెనైదా జిల్లాలో ఒక హిందూ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా.. ఆమె జుట్టు కత్తిరించి చెట్టుకు కట్టేసి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉదంతం బంగ్లాదేశ్‌లో ఆటవిక పాలనను గుర్తు చేస్తోంది. మరో విషాదకర ఘటనలో షరియత్ పూర్ జిల్లాకు చెందిన ఖోకన్ చంద్ర దాస్ అనే వ్యక్తినిదుండగులు సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన ఆయన జనవరి 3వ తేదీన మరణించారు. అలాగే అన్సార్ బాహిని సభ్యుడైన బజేంద్ర బిస్వాస్, అమృత్ మండల్ వంటి పలువురు హిందువులు గత కొద్ది రోజులుగా మూక దాడులకు బలికావడం మైనారిటీల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
బంగ్లాదేశ్‌లో హిందువుల పట్ల కొనసాగుతున్న ఈ శత్రుత్వ పూరిత వాతావరణంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులపై 2,900కు పైగా హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ ఘటనలను కేవలం మీడియా అతిశయోక్తిగా కొట్టిపారేయలేమని, మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్ ప్రభుత్వం విస్మరిస్తోందని భారత్ ఘాటుగా విమర్శించింది.
ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి మాట్లాడే అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్‌లో హిందువుల రక్తపాతంపై మౌనం వహించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మైనారిటీ జనాభా సుమారు 7 శాతానికి పడిపోయిన ఈ దేశంలో.. రక్షణ కరువై హిందువులు వలస వెళ్లే పరిస్థితులు తలెత్తుతున్నాయి. యూనస్ ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే అక్కడ మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa