ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండె సమస్యల్ని దూరం చేసే ఫుడ్స్, రెగ్యులర్‌గా తింటే గుండెకి మంచిదట

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 09:11 PM

​గుండె సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు చూస్తే పెరిగిన ఒత్తిడి, సరిలేని డైట్, కొద్దిపాటి వర్కౌట్ కూడా చేయకపోవడం. ఎప్పుడు ఏదో టెన్షన్ ఉండడం ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇన్నికారణాలని సరిచేసుకుని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితి అందరికీ ఉంది. ఎప్పటికప్పుడు గుండె పనితీరుని పరిశీలిస్తూ ఉండాలి. ముఖ్యంగా, ఒత్తిడిని తగ్గించుకుని లైఫ్‌స్టైల్ మెరుగ్గా మార్చుకోవాలి. దీంతో పాటు సరైన డైట్ కూడా మెంటెయిన్ చేయాలి. ప్రాసెస్డ్,జంక్ ఫుడ్ కారణంగా ఫ్యాట్ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అలా కాకుండా, మంచి డైట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే ఫుడ్స్ తీసుకోవాలి. అవేంటో డాక్టర్ మనోజ్ఞ మనతో షేర్ చేసుకుంటున్నారు.


ఓట్స్‌తో గుండెకి మేలు


​ఓట్స్ అనేవి ఇప్పుడు మనకి కామన్ ఫుడ్‌గా మారింది. ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే ఈ ఫుడ్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే గుండె సమస్యల్ని దూరం చేయడంలో ఓట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని మనం పాలలో కలిపి, రాత్రుళ్ళు నానబెట్టి, కిచిడీలా ఇలా ఎలా అయినా చేసి తినొచ్చు.


బాదం, ఆక్రోట్స్, పల్లీలు కూడా మేలే


​నట్స్ ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాదం, ఆక్రోట్స్, పల్లీల్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవన్నీ మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో కీ రోల్ పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ ఫుడ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి.


చేపలు కూడా మంచివే


అదే విధంగా, చేపలు కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందుంటాయి. ముఖ్యంగా సాల్మన్, సార్డిన్, ట్యూనా వంటి చేపల్లో గుండెకి మేలు చేసే పోషకాలు ఉంటాయి. కాబట్టి, వారంలో కనీసం ఒకట్రెండు సార్లైనా ఈ చేపల్ని మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే వచ్చే గుండె సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.


బెర్రీస్‌తో నో వర్రీస్


బెర్రీస్‌లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించి గుండెని కాపాడతాయి. బెర్రీస్‌లో చాలా రకాలు ఉంటాయి. అయితే, స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్బెర్రీస్ గుండెకి మేలు చేస్తాయి. కాబట్టి, వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది.


ఆకుపచ్చని ఆకుకూరలు


ఇందులో ముఖ్యంగా పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు తీసుకోవాలి. వీటిలోని ఫైబర్, ఐరన్ వంటి పోషకాలన్నీ కూడా గుండెకి మేలు చేస్తాయి. వీటిని మనం ఎలా అయినా తీసుకోవచ్చు. వారంలో రెండు మూడు సార్లైనా మీ డైట్‌లో ఈ ఆకుకూరల్ని యాడ్ చేసుకుంటే గుండెకి మేలు చేసినవారవుతారు.


ఏ నూనె వాడాలి


ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల నూనెలు వచ్చాయి. అయితే, అన్నీ కూడా మంచివి కావు. అందులో గుండెకి మేలు చేసే ఆయిల్స్ ఆలివ్ ఆయిల్, నువ్వులనూనె, వేరుశనగ నూనె వంటివి తీసుకోవాలి. వీటి వల్ల గుండెకి మేలు జరుగుతుంది. అయితే, అవి కూడా ఎక్కువ పరిమాణంలో కాకుండా కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి.


టమాటలతో గుండెకి మేలు


టమాటల్లో టైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇది గుండె నాళాల్లో కొవ్వుని పేరుకుపోకుండా చేస్తుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి. మనం వీటిని ఎలాగూ కూరల్లో వాడుతూనే ఉంటాం. కానీ, వాడని వారు రెగ్యులర్‌గా టమాటల్ని కూరల్లో వాడడం అలవాటు చేసుకోండి.


డార్క్ చాక్లెట్ కూడా మంచిదే


చాక్లెట్స్‌లో డార్క్ చాక్లెట్ ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఇందులో 70 శాతం కోకో కంటెంట్ ఉంటుంది. ఇది మన గుండెకి మేలు చేస్తుంది. తినడానికి చేదుగా ఉన్నప్పటికీ దీని వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అయితే, మార్కెట్లో ఎన్నో రకాల డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా మంచి కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్‌ని తీసుకోవడం మంచిది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa