ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రెడిట్ స్కోర్ నుంచి వడ్డీ రేట్ల వరకు.. ఈ 2026లో ఆర్భీఐ తెచ్చిన 6 కొత్త రూల్స్ ఇవే

business |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 11:44 PM

భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఖాతాదారులు, రుణ గ్రహీతలకు మరింత పారదర్శకత, ఆర్థిక వెసులుబాటు కల్పించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కీలక సంస్కరణలు చేపట్టింది. 2026 ప్రారంభం నుంచి ఆరు కొత్త రూల్స్ అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు కేవలం రుణాలపైన వడ్డీ భారాన్ని తగ్గించడమే కాకుండా, బ్యాంకుల జవాబుదారీతనాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ అప్‌డేట్లు, లోన్ ఫోర్‌క్లోజర్ ఛార్జీల రద్దు, విఫలమైన లావాదేవీలకు పరిహారం వంటి అంశాల్లో సామాన్యుడికి పెద్ద పీట వేశారు. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.


1. వారానికోసారి క్రెడిట్ స్కోర్ అప్‌డేట్


గతంలో మీ క్రెడిట్ స్కోర్ నెలకోసారి మాత్రమే మారేది. కానీ ఇప్పుడు పారదర్శకత కోసం ప్రతి వారం అంటే నెలలో నాలుగు సార్లు (7, 14, 21, 28వ తేదీల్లో) మీ క్రెడిట్ సమాచారాన్ని బ్యాంకులు అప్‌డేట్ చేయాలి. దీనివల్ల మీరు లోన్ కట్టిన వెంటనే మీ స్కోర్ మెరుగుపడటం ఇన్స్టంట్‌గా కనిపిస్తుంది.


2. ముందస్తు చెల్లింపులపై 'సున్నా' ఛార్జీలు


జనవరి 1, 2026 నుంచి హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్న వారు తమ రుణాన్ని గడువు కంటే ముందే ముగించాలనుకుంటే లేదా కొంత మొత్తాన్ని ముందుగానే కట్టాలనుకుంటే (Prepayment), బ్యాంకులు ఎలాంటి పెనాల్టీలు లేదా ఛార్జీలు వసూలు చేయకూడదు. అయితే ఇది కేవలం ఫ్లోటింగ్ రేట్ రుణాలకు మాత్రమే వర్తిస్తుంది.


3. విఫలమైన లావాదేవీలకు రోజుకు రూ.100 పరిహారం


ఏటీఎం లేదా ఆన్‌లైన్ లావాదేవీల్లో మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయ్యి, అవతలి వారికి అందకపోయినా లేదా నగదు రాకపోయినా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి. 5 పనిదినాల లోపు ఆ డబ్బు తిరిగి మీ ఖాతాలో పడాలి. ఒకవేళ బ్యాంకు ఆలస్యం చేస్తే, ఆ రోజు నుంచి కస్టమర్‌కు రోజుకు రూ. 100 చొప్పున బ్యాంకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


4. గోల్డ్ మెటల్ లోన్ గడువు పెంపు


బంగారు ఆభరణాల తయారీదారులు తీసుకునే గోల్డ్ మెటల్ లోన్ రీపేమెంట్ గడువును ప్రభుత్వం 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచింది. దీనివల్ల వ్యాపారులకు పని మూలధనం సర్దుబాటు చేసుకోవడానికి అదనంగా మూడు నెలల సమయం లభిస్తుంది.


5. ఒకే ఖాతాకు నలుగురు నామినీలు


ఆస్తి వారసత్వ గొడవలను నివారించేందుకు, కస్టమర్ల సౌలభ్యం కోసం ఇప్పుడు బ్యాంక్ ఖాతాలు, లాకర్లకు నలుగురు నామినీలను చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో ఈ పరిమితి తక్కువగా ఉండేది.


6. సిబిల్ బాగుంటే వడ్డీ తగ్గించమని అడగవచ్చు


మీరు లోన్ తీసుకున్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండి, ఆ తర్వాత అది గణనీయంగా పెరిగితే మీరు బ్యాంకును సంప్రదించి మీ వడ్డీ రేటును తగ్గించమని కోరవచ్చు. దీనికోసం గతంలో ఉన్న 3 ఏళ్ల నిరీక్షణ నిబంధనను తొలగించారు. మీ స్కోర్ ఎప్పుడు మెరుగుపడితే అప్పుడే మీరు ఈ వెసులుబాటును పొందవచ్చు.


ఈ కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల బ్యాంకింగ్ రంగంలో కస్టమర్లే రాజులు అని మరోసారి రుజువవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు రుణాల నిర్వహణ, పన్ను ఆదాలో ఇవి ఎంతగానో దోహదపడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa