సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పథకాలు అమలవుతున్నాయి. అయితే వీటన్నింటికీ భిన్నంగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఒక అడుగు ముందుకు వేసి.. పురుష లోకాన్ని ఆశ్చర్యపరిచేలా సరికొత్త హామీని తెరపైకి తెచ్చింది.
మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఇడప్పాడి కే. పళనిస్వామి మొదటి విడత ఎన్నికల వాగ్దానాలను ప్రకటించారు. ఇందులో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. తాము అధికారంలోకి వస్తే సిటీ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించడం. ప్రస్తుతం అధికార డీఎంకే హయాంలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండగా.. దానిని పురుషులకు కూడా విస్తరిస్తామని అన్నాడీఎంకే స్పష్టం చేసింది.
ఎందుకీ నిర్ణయం?
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలు చేస్తున్నప్పుడు పురుషుల నుంచి అక్కడక్కడా విమర్శలు వచ్చాయి. "కేవలం ఆడవాళ్లకేనా.. మా పరిస్థితి ఏంటి?" అని సామాన్య పురుషులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఈ అసంతృప్తిని ముందే పసిగట్టిన అన్నాడీఎంకే.. సామాన్య, మధ్య తరగతి పురుషులపై ఆర్థిక భారాన్ని తగ్గించే వ్యూహంతో ఈ హామీని మేనిఫెస్టోలో చేర్చింది. మహిళలకు ఇప్పటికే ఉన్న సౌకర్యాన్ని యధాతథంగా కొనసాగిస్తూనే.. పురుషులకు కూడా ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా రాష్ట్రంలోని మెజారిటీ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని పళనిస్వామి భావిస్తున్నారు.
కింగ్ మేకర్ అయ్యేనా?
అన్నాడీఎంకే కేవలం ఈ ఒక్క హామీతోనే ఆగలేదు. మొదటి దశ వాగ్దానాల్లో భాగంగా మరో నాలుగు కీలక పథకాలను కూడా ప్రకటించింది. మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం వంటి పథకాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. అయితే పురుషులకు ఉచిత బస్సు హామీ మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. ఒకవైపు ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్నాడీఎంకే వేసిన ఈ 'ఫ్రీ బస్' అస్త్రం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. డీఎంకే మగువల మనసు గెలుచుకుంటే.. అన్నాడీఎంకే అందరి మనసు గెలుచుకోవాలని చూస్తోంది. ఈ వ్యూహం అన్నాడీఎంకేను మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెడుతుందా అన్నది 2026 ఎన్నికల ఫలితాలే తేల్చాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa